ఢిల్లీకి సీఎం జగన్ - అమిత్ షా తో భేటీ : కీలక నిర్ణయం..!?
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ నెల 17న ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని తో పాటుగా అమిత్ షా తోనూ సమావేశం అయ్యారు. ఏపీ అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత సీఎం జగన్ రాజకీయంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం గవర్నర్ నజీర్ అహ్మద్ తో సీఎం జగన్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు. ఏపీ ఆర్దిక అంశాలతో పాటుగా రాజకీయ అంశాలు పర్యటనలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి జగన్ వరుస భేటీ..పర్యటనలతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. వారి పైన వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. టీడీపీ ఆ నలుగురిని ప్రలోభాలకు గురి చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. క్రాస్ ఓటింగ్ ను నలుగురు ఎమ్మెల్యేలు ఖండిస్తున్నారు.

మరో 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత సీఎం జగన్ గవర్నర్ నజీర్ అహ్మద్ తో సమావేశమయ్యారు. మండలి ఎన్నికల వేళ చోటు చేసుకున్న పరిణామాలను వివరించినట్లు సమాచారం.
ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సీఎం జగన్ భేటీ కానున్నారు. సీఎం వరుస సమావేశాల నేపథ్యంలో ఏపీలో రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ మొదలైంది. ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇది పూర్తిగా పాలనా పరమైన అంశాలకు సంబంధించిన అధికారిక పర్యటనగా చెబుతున్నారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ 10 వేల కోట్ల రూపాయాలు అడహక్ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం కోరింది. ఈ విషయాన్ని తాజాగా అసెంబ్లీ సమావేశాల్లోనూ సీఎం జగన్ వెల్లడించారు. ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ అటు రాజకీయంగా.. ఇటు పాలనా పరంగా కీలక నిర్ణయాలకు జగన్ సిద్దం అవుతున్నారు. ఢిల్లీ పర్యటన తరువాత ఏపీలో రాజకీయంగా కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications