కీలక నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేపై సీఎం జగన్ వేటు..!!
ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫారసుల మేరకు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రకటించింది. గతంలో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసారు. వైసీపీ ఆవిర్భావం నుంచి రావి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు.
2014 ఎన్నికల్లో పొన్నూరులో పోటీచేసి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చేతిలో రావిపరాజయం పాలయ్యారు. తిరిగి 2019లో టికెట్ ఆశించారు. కానీ, అనూహ్యంగా చివరి నిమిషంలో పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోశయ్యకు టికెట్ ఖరారు అయింది. అప్పటి నుంచి రావి వెంకటరమణ కు ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని అంచనా వేసారు. దీని పైన పలు మార్లు ఆయన సీఎం జగన్ ను కలిసారు. ఇక, నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలారి రోశయ్య వర్సస్ రావి వెంకట రమణ అనే విధంగా ఆధిపత్య పోరు మొదలైంది. అసంతృప్తి జ్వాలలు నియోజకవర్గంలో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ విభేదాల వ్యవహారం అధిష్ఠానం దృషికి వెళ్లింది. తాజాగా రావి వర్గానికి చెందిన ఒక వ్యక్తి పైన దాడి జరిగింది.

దీనికి నిరసనగా పొన్నూరులో రావి వర్గం ఆందోళనకు దిగింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలను కలిసి ఎమ్మెల్యే పైన ఫిర్యాదు చేసారు. ఆ వ్యక్తిపై దాడితో ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్యే కిలారి రోశయ్య చెప్పారు. ఈ పరిణామాల తరువాత రావి వెంకట రమణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గం నుంచి తొలి నుంచి టీడీపీ కంచుకోటగా ఉంది. అక్కడ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఇంఛార్జ్ గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో నరేంద్రను వైసీపీ అభ్యర్ధి రోశయ్య ఓడించారు. వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..ఇప్పుడు ఆ నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య విభేదాలు సస్పెన్షన్ వరకు వెళ్లాయి. దీంతో, ఇప్పుడు రావి వెంకట రమణ రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications