'బెజవాడలో 'భాయ్' కల్చర్.. సుబ్బు లాంటోళ్లతో, బాబే ప్రోత్సహిస్తున్నాడు?'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్‌లా మారుస్తానని చెబుతున్న సీఎం చంద్రబాబు.. గన్ కల్చర్ ను ప్రోత్సహించి రాష్ట్రాన్ని బీహార్ తరహాలో మారుస్తున్నారని వైసీపీ నేత పార్ధసారథి విమర్శించారు. సుబ్బు లాంటి నేరస్తులతో జతకట్టి ముంబై తరహాలో విజయవాడలోను 'భాయ్' కల్చర్ ను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
Recommended Video

ఆదివారం విజయవాడలో పార్ధసారథి మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇద్దరూ అసాంఘీక శక్తులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. విజయవాడకు గన్ కల్చర్‌ను పరిచయం చేసి ఎంతోమంది ప్రముఖులు పుట్టిన ఈ ప్రాంతాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని అన్నారు.

ఇటీవల విజయవాడ నుంచి పోలీసులు బహిష్కరించిన సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు అనే నేరస్తుడు ముఖ్యమంత్రి, మంత్రి పరిటాల సునీతలతో దిగిన ఫోటోలను మీడియా ముందు పెట్టారు పార్దసారథి. పోలీసులు సుబ్బును నగరం నుంచి బహిష్కరించినప్పటికీ.. అతను మాత్రం తిరిగి నగరంలో యాక్టివ్ అయినట్టు చెబుతున్నారు.
ప్రజల ముందుక వచ్చి నేరస్తులను ఏమాత్రం సహించేది లేదని చంద్రబాబు.. తిరిగి నేరస్తులతోనే ఫోటోలకు పోజు ఇస్తున్నారని మండిపడ్డారు. నేరస్తుడు సుబ్రహ్మణ్యం ఇటలీ నుంచి మరిన్ని గన్స్ దిగుమతి చేసుకున్నట్టు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీతో దగ్గరి సంబంధాలు ఉండటం వల్లే పోలీసులు అతన్ని చూసీ చూడనట్టు వదిలేస్తున్నారని అన్నారు.