కెసిఆర్ షరతు: సిఎం పోస్టు, 4గురు ఎంపీలకు ఎసరు?
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి విషయంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెసు మధ్య పొత్తుపై ప్రతిష్టంభన ఏర్పడినట్లు సమాచారం. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పేరును అధికారికంగా ప్రకటించాలని తెరాస డిమాండ్ చేస్తుండగా, ఎన్నికలకు ముందు అలా ప్రకటించబోమని కాంగ్రెసు అధిష్టానం అంటోంది. పొత్తులపై ప్రాథమికంగా చర్చలు జరిగాయి. కాంగ్రెసు అంగీకరించకపోవడంతో చర్చలు ముందుకు సాగలేదు.
కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ హైదరాబాదుకు వచ్చిన నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య అధికారికంగా చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కెసిఆర్‌తో దిగ్విజయ్ సింగ్ రహస్యంగా మాట్లాడినట్లు చెబుతున్నారు. సీట్ల పంపకాలపై ఇది వరకే చర్చలు జరిగాయి. లోకసభ, శాసనసభ ఎన్నికల్లో సగం సగం సీట్లకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి.
సీట్ల పంపకం పెద్ద సమస్య కాదని, కెసిఆర్‌ను ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడమే ముఖ్యమని తెరాస నాయకులు అంటున్నారు. నిజానికి, తెరాస 60 శాతం సీట్లను అడిగింది. అయితే, కెసిఆర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే 50 శాతం సీట్లతో సరిపుచ్చుకుంటామని చెప్పాయి. తెలంగాణలో 119 శాసనశభ స్థానాలు, 17 లోకసభ స్థానాలు ఉన్నాయి.

నలుగురు కాంగ్రెసు సిట్టింగ్ పార్లమెంటు సభ్యులకు కూడా కెసిఆర్ ఎసరు పెడుతున్నట్లు సమాచారం. మల్కాజిగిరి (సర్వే సత్యనారాయణ), వరంగల్ (ఎస్ రాజయ్య), కరీంనగర్ (పొన్నం ప్రభాకర్), నిజామాబాద్ (మధుయాష్కీ) సీట్లలో అభ్యర్థులను మార్చాలని కెసిఆర్ అడుగుతున్నట్లు చెబుతున్నారు. అయితే, తమ పార్టీ అభ్యర్థుల విషయంలో తెరాస జోక్యం కూడదని, ఆ విషయం తాము మాత్రమే చూసుకుంటామని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు చెప్పినట్లు సమాచారం.
కాంగ్రెసు నుంచి ముఖ్యమంత్రి పదవి కోసం దాదాపు డజను మంది పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కెసిఆర్‌ను ప్రకటించకపోతే ఎన్నికల్లో కూటమిని మందుకు నడపడం కష్టమని తెరాస నాయకులు అంటున్నారు.
పొత్తు కోసం తాము చొరవ చూపడం లేదని, కాంగ్రెసు చర్చలకు సిద్ధపడితే తాము అందుకు సిద్ధంగా ఉన్నామని తెరాస నాయకులు అంటున్నారు. కెసిఆర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి అంగీకరిస్తే కాంగ్రెసుతో తెరాస పొత్తు కుదిరే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగానే, కెసిఆర్‌కు బద్ధ వ్యతిరేకి అయిన సీనియర్ నేత జానా రెడ్డిని పక్కన పెట్టి, పొన్నాల లక్ష్మయ్యను తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెసు అధిష్టానం ఎంపిక చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications