టీటీడీకి ట్యాంకరంత నెయ్యి
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. మంగళవారం నాడు 71,153 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,863 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.32 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 14 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 8 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్లమెంట్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీళ్లు, పాలు పంపిణీ చేశారు.

అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమౌతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.
4వ తేదీన సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం చేస్తారు శ్రీవారి అర్చకులు. రాత్రి 9 గంటలకు శ్రీమలయప్ప స్వామివారిని పెద శేష వాహనంపై ఊరేగిస్తారు. 5న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తుల కోసం అదనపు లడ్డూలను తయారు చేయడానికి టీటీడీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేస్తోన్నారు. తిరుమలేశుడి దర్శనానంతరం వారికి అందజేసే లడ్డూ తయారీని మరింత ముమ్మరం చేయనున్నారు.

ఎంతమంది భక్తులు వచ్చిన వారందరికీ శ్రీవారి ప్రసాదాన్ని ఇఛ్చేలా ఏర్పాట్లు చేస్తోన్నారు. దీనికోసం లడ్డూ కౌంటర్లల్లో అదనపు సిబ్బందిని నియమించే అవకాశాలు లేకపోలేదు. శ్రీవారి పోటులో పనిచేసే సిబ్బంది సంఖ్యను కూడా పెంచేలా చర్యలను తీసుకుంటోన్నారు.
ఇందులో భాగంగా- కర్ణాటక పాల సమాఖ్య టీటీడీకి నెయ్యిని పంపించింది. నందిని బ్రాండ్‌తో కర్ణాటకలో పాలు, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది కేఎంఎఫ్. చాలావరకు ఇక్కడి నుంచే టీటీడీ అధికారులు నెయ్యిని కొంటుంటారు. గతంలో కొంత వివాదం నడిచినప్పటికీ- ఆ తరువాత అది సమసిపోయింది.
ఈ నేపథ్యంలో తిరుమలకు పంపించాల్సిన నెయ్యితో కూడిన ట్యాంకర్‌ను బుధవారం రాత్రి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన అధికారిక నివాసంలో జెండా ఊపి ప్రారంభించారు. దేశంలోనే అత్యంత నాణ్యమైన నెయ్యిని తయారు చేస్తుందనే గుర్తింపు ఉంది కర్ణాటక పాల సమాఖ్యకు. అందుకే టీటీడీ సైతం అక్కడి నుంచే నెయ్యిని కొనుగోలు చేస్తుంటుంది.












Click it and Unblock the Notifications