విభజన వల్ల రాజధానిని కోల్పోయాం..గాయాలు మానలేదు..సాయం చేయండన్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన వల్ల చాలా నష్టపోయిందని, ఆ గాయాలు ఇంకా మానలేదు అని అందుకే ఏపీపై ఉదారంగా వ్యవహరించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎంకే సింగ్ తో పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ తాజాగా 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్ కే సింగ్ బృందంతో భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం అందించాలని, చేయూతనివ్వాలని కోరారు . ఉదారంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

15వ ఆర్థిక సంఘానికి ఆర్ధిక బాధలు చెప్పుకున్న ఏపీ సర్కార్
రాష్ట్ర పర్యటనకు వచ్చిన 15వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని వివరించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్, కార్యదర్శి అరవింద్ మెహతా, రవి కోటా తదితరులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ శాఖల ఉన్నతాధికారులు రాష్ట్ర పరిస్థితులపై వారికి సవివరంగా తెలియజేశారు. కష్టాల నుండి గట్టెక్కటానికి రూ .40,543 కోట్ల గ్రాంట్‌ను సిఫారసు చేయాలని అభ్యర్థించారు. పెట్టుబడులను ఆకర్షించడానికి వీలుగా రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు మంజూరు చేయాలని కమిషన్ సిఫారసు చేయాలని కోరారు.

విభజన గాయాలు మానలేదని, నష్టపోయామని చెప్పిన ప్రభుత్వం
విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ బాగా దెబ్బతిందని, అశాస్త్రీయంగా, అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం వల్ల రాజధానిని కోల్పోయామని 15వ ఆర్థిక సంఘానికి ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. విభజన వల్ల రాజధానిని కోల్పోయిన ఒకే ఒక రాష్ట్రం దేశంలో ఏపీ మాత్రమేనని స్పష్టం చేసింది. అన్ని రంగాల్లో రాష్ట్రం కోలుకోవాలంటే ఉదారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో నిధులు అందేలా సిఫార్సులు చేయాలని కోరింది.

పారిశ్రామిక ,సేవా రంగాల్లో ఎలాంటి వృద్ధి లేకుండా పోయిందని జగన్ ఆవేదన
రాష్ట్ర సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక, సేవ, ఆరోగ్య, విద్యా, మౌలిక రంగాలపై అధికారులు సమగ్ర వివరాలు అందించారు. విభజనతో తీవ్రంగా నష్టపోయామని.. ఆ గాయాలు మానడం లేదని.. పారిశ్రామిక ,సేవా రంగాల్లో ఎలాంటి వృద్ధి లేకుండా పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీల అమలుకు కేంద్రంలో యంత్రాంగం ఉండేలా చూడాలని కోరారు.పెండింగ్ హామీలు అమలు చేయాలని, రాష్ట్ర పథకాలకు నిధులు ఇవ్వాలని కోరారు.

ప్రత్యేక హోదా ఇచ్చేలా సిఫార్సు చెయ్యాలని జగన్ విజ్ఞప్తి
ప్రత్యేక హోదా ఇచ్చేలా సిఫార్సు చెయ్యాలని జగన్ ఆర్ధిక సంఘాన్ని కోరారు నేషనల్ సేవింగ్ ఇన్స్టిట్యూట్ , కేంద్రం రుణాలు రూ. 22,733 కోట్లు మాఫీ చెయ్యాలని కోరారు.జిల్లాల సంఖ్యా ఆధారంగా నిధుల కేటాయింపు సరికాదని పేర్కొన్నారు. ఏ మాత్రం అభివృద్ధి లేకుండా, విభజన హామీలు కూడా నెరవేరకుండా పీకల్లోతు కష్టాల్లో , నష్టాల్లో ఉన్న ఎపీని ఆడుకోందని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications