పార్టీ లైన్లోకి యూ టర్న్: కిరణ్‌పై డి శ్రీనివాస్ పిట్టకథ
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనమండలి సభ్యులు, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన ఓ పిట్టకథ చెప్పారు! ముఖ్యమంత్రి విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ కాంగ్రెసు అధిష్టానానికి కట్టుబడి పార్టీ లైన్‌లోకి వచ్చి సహకరిస్తారని చెప్పేందుకు ఆయన ఈ కథను చెప్పారు.
'పశ్చిమ బెంగాల్‌లో సుబ్రతో బెనర్జీ అనే నాయకుడు ఉండేవారు. ఇప్పుడు ఆయన తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్నారు. సుబ్రతో బెనర్జీ నాడు ఎన్ఎస్‌యూఐ బెంగాల్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగానే కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించే వారు. అప్పట్లో రాష్ట్రంలో ర్యాలీలకు అనుమతి ఇచ్చే వారు కాదు.

ఒకవేళ యూనియన్ తరఫున ర్యాలీ చేయదలిస్తే సుబ్రతో బెనర్జీ తన అనుయాయుడు, పశ్చిమ బెంగాల్ ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో దరఖాస్తు చేయించే వారు. దానికి ఆయన ఒక మంత్రిగా అనుమతి ఇచ్చేవారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర నాయకుడిగా సమైక్యాంధ్ర కోసం కొట్లాడుతూనే.. ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ లైన్‌లోనే వెళ్తారు అని డిఎస్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెసు పార్టీ రోడ్ మ్యాప్ ప్రకారమే వెళ్తోందని డి శ్రీనివాస్ అన్నారు. త్వరలో విభజన ఖాయమని, రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందనే వాదనలో పస లేదన్నారు. కిరణ్ ఇప్పుడు సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తున్నప్పటికీ చివరకు అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటారన్నారు.












Click it and Unblock the Notifications