ఎమ్మెల్యేలకు జగన్ టార్గెట్ ఫిక్స్.. గురి తప్పితే వేటే..!!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువగా కానుంది. రాష్ట్రస్థాయి పరిపాలనను ప్రతి గ్రామానికి చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తోన్న సచివాలయాలకు ప్రభుత్వం కొత్త బాధ్యతలను అప్పగించింది. దీన్ని వైఎస్ జగన్ నేరుగా పర్యవేక్షించనున్నారు. ఆయన సూపర్ వైజింగ్‌లో ఇది కొనసాగనుంది.

ప్రతిరోజూ స్పందన..
కొత్తగా స్పందన కార్యక్రమాన్ని గ్రామ/వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకుని రానుంది ప్రభుత్వం. ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ కార్యక్రమం ఉంటుంది. దీన్ని తప్పనిసరిగా నిర్వహించాల్సిఉంటుందని వైఎస్ జగన్ ఆదేశించారు. గ్రామాలు/వార్డు స్థాయిల్లో నెలకొన్న సమస్యలను ప్రజల నుంచి నేరుగా స్వీకరించడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది. ఆ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఇదివరకే ప్రభుత్వం ఒక్కో సచివాలయానికి 20 లక్షల రూపాయలను మంజూరు చేసింది కూడా.

షెడ్యూల్ ఇదీ..
దీనికి అదనంగా- ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్ డివిజన్, మండల స్థాయిలోనూ స్పందన కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంటుంది. రెవెన్యూ, వైద్య-ఆరోగ్యం, పంచాయతీ లేదా మున్సిపాలిటీల అధికారులు స్పందన కార్యక్రమంలో పాల్గొనేలా ఉత్తర్వులు జారీ చేసింది. స్పందన ద్వారా అందిన విజ్ఞప్తులపై ప్రతి బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లు స్వయంగా సమీక్షిస్తారు. ప్రతి గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో స్పందనపై సమీక్ష చేస్తారు.

ఒక్కో సచివాలయానికి..
గడప గడపకు మన ప్రభుత్వం కింద ఇప్పటికే ప్రభుత్వం ఒక్కో సచివాలయానికి 20 లక్షల రూపాయలను మంజూరు చేసింది. స్పందన ద్వారా అందిన విజ్ఞప్తులు, సమస్యలను పరిష్కరించడానికి ఈ నిధులను వినియోగించాల్సి ఉంటుంది. ప్రతి ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గం పరిధిలో ఉన్న సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలి. నెలలో ఆరు సచివాలయాలను నేరుగా పర్యవేక్షించాల్సి ఉంటుందని జగన్ నిర్దేశించారు. ఎమ్మెల్యేలు ఒక్కో సచివాలయం కోసం రెండు రోజులను కేటాయించాల్సి ఉంటుంది.

మౌలిక సదుపాయాలపై..
గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థలో ఎలాంటి నిర్లక్ష్యానికి పాల్పడినా ఉపేక్షించబోనంటూ ఇప్పటికే వైఎస్ జగన్ హెచ్చరికలు జారీ చేశారు.
పారిశుద్ధ్య పనుల నిర్వహణ, మురుగునీటి కాల్వల మరమ్మతు, రోడ్లు, వీధి దీపాలు, మంచినీటి సరఫరా, కల్వర్టల నిర్మాణం/మరమ్మతు, ఇతర సివిల్ నిర్మాణ పనుల వంటి కనీస మౌలిక సదుపాయాల పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. పనుల పురోగతిపై ఫొటోలను తీసి గడప గడపకు మన ప్రభుత్వం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.

ప్రతిష్ఠాత్మకంగా..
క్షేత్రస్థాయిలో ఆ పనుల గురించి తెలుసుకోవడానికి ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్‌ను ప్రభుత్వం నియమించింది. గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థను వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న విషయం తెలిసిందే. గ్రామస్థాయిలో పరిపాలన మొత్తానికీ సచివాలయాలే కేంద్రబిందువులుగా మారాయి. అలాంటి చోట ఎలాంటి పొరపాట్లు తలెత్తకూడదని ఆయన భావిస్తోన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదనే సంకేతాలను పంపించారు.












Click it and Unblock the Notifications