మహిళా సంఘాలకు వైఎస్ జగన్ తీపికబురు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వరుసగా సంక్షేమ పథకాల కింద నిధులను విడుదల చేయడానికి శ్రీకారం చుట్టారు. ఇవ్వాళ జగనన్న తోడు కింద నిధులను లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. వరుసగా నాలుగో ఏడాది బటన్ నొక్కి నిధులను విడుదల చేశారాయన. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఈ పథకం కింద 5,10,412 మందికి ప్రభుత్వం మరో విడత వడ్డీ లేని రూ. 549.70 కోట్ల రుణాలను అందజేశారు. గతంలో ఈ పథకం ద్వారా రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన వారికి 11.03 కోట్ల రూపాయల వడ్డీ మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఈ పథకం కింద తోపుడు బండ్లు, రోడ్ల వెంబడి చిన్న దుకాణాల్లో పండ్లు, కూరగాయలు వంటివి అమ్ముకోవడం, టీ, టిఫిన్ సహా పలు రకాల వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులకు, సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు జగనన్న తోడు పథకం అండగా నిలుస్తోంది ప్రభుత్వం.

చిరువ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా 10,000 రూపాయల రుణాన్ని అందజేయడంతో పాటు తీసుకున్న రుణాన్ని ప్రతి నెలా కిస్తీ రూపంలో సకాలంలో చెల్లించే వారికి ఆ రుణంపై అయ్యే వడ్డీ మొత్తం ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. వారికి మరింత రుణ సాయాన్ని కూడా అందిస్తుంది. కొత్త వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ది పొందే వారిలో దాదాపు 85 శాతం మహిళలే ఉన్నారు.
తాజాగా- మరో పథకం కింద నిధులను విడుదల చేయడానికి వైఎస్ జగన్ సన్నాహాలు చేస్తోన్నారు. ఆసరా కింద స్వయం సహాయక సంఘాలకు నిధులను పంపిణీ చేయబోతోన్నారాయన. దీనికోసం ఈ నెల 26వ తేదీన అమలాపురంలో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు. జీఎంసీ బాలయోగి స్టేడియంలో బహిరంగ సభ ఏర్పాటుకానుంది.
స్వయం సహాయక సంఘాల కోసం సున్నా వడ్డీతో రుణాన్ని పునరుద్ధరించింది ప్రభుత్వం. దీనికోసం అప్పట్లో 1,400 కోట్ల రూపాయలను విడుదల చేశారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8.78 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 95 లక్షల మంది మహిళలకు లబ్ది కలుగుతుంది.












Click it and Unblock the Notifications