• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొగ్గు సంక్షోభం- పెరిగిన ధరలు : పొంచి ఉన్న విద్యుత్ కోత : ఏపీలో మరీ దారుణంగా- కేంద్రం సహకరిస్తేనే..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

మరోసారి విద్యుత్ కోతలు తప్పేలా లేవు. కోతల ముప్పు పొంచి ఉంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం బొగ్గు సంక్షోభం ఏర్పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ప్రభావం భారత్‌పైనా, ఏపీ పైనా పడుతోంది. దేశవ్యాప్తంగా విద్యుదుత్పత్తి చేసే కేంద్రాల్లో బొగ్గు ఆధారిత ప్లాంట్ల వాటా 70శాతం. వీటిలో ఇప్పటికే 16 ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అయిపోయి మూతపడ్డాయి. అంటే 16,880 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది.

కొనసాగుతున్న బొగ్గు కొరత

కొనసాగుతున్న బొగ్గు కొరత

ఎన్టీపీసీ, టాటా పవర్, టొరెంట్‌ పవర్‌ ఇలా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని చిన్నా పెద్దా అన్నీ కలిపి 135 థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఉండగా అవన్నీ ఇప్పుడు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. 30 ప్లాంట్లలోని నిల్వలు కేవలం ఒక రోజులో అయిపోతాయి. దీంతో 37,345 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ఆగిపోతుంది. 18 ప్లాంట్లు రెండు రోజుల్లోనూ, 19 ప్లాంట్లు 3 రోజుల్లోనూ, 9 ప్లాంట్లు నాలుగు రోజుల్లోనూ, 6 ప్లాంట్లు 5 రోజుల్లోనూ, 10 ప్లాంట్లు ఆరు రోజుల్లోనూ, ఒక ప్లాంటు ఏడు రోజుల్లోనూ బొగ్గు సరఫరా జరగకపోతే మూసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి.

భారీగా పెరిగిన ధరలు..సంక్షోభం

భారీగా పెరిగిన ధరలు..సంక్షోభం

అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు రికార్డు స్థాయిలో అంటే దాదాపు నలభై శాతం పెరిగాయి. ఇక దేశంలోని బొగ్గు ఉత్పత్తిలో 80శాతం వాటా కలిగిన కోల్‌ ఇండియా.. ప్రపంచ బొగ్గు ధరల్లో పెరుగుదల కారణంగా, దేశీయ బొగ్గు ఉత్పత్తిపై తాము ఆధారపడాల్సి వస్తోందని వెల్లడించింది. డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగంలో టాప్‌-2 దేశాలైన భారత్, చైనాలపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. కొద్దిరోజుల్లోనే మన దేశం అసాధారణ విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏపీ పైన అధిక ప్రభావం

ఏపీ పైన అధిక ప్రభావం

బొగ్గు ఉత్పత్తిని కనీసం 10-18 శాతానికి పెంచాలని కోల్‌ ఇండియా నిర్ణయించింది. దీనికి కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. ఇక, ఏపీలో పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా మారుతోంది. రాష్ట్రంలో ప్రధాన థర్మల్‌ కేంద్రాలైన డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎన్‌టీటీపీఎస్‌), రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ఆర్‌టీపీపీ), శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎస్‌డీఎస్‌టిపీఎస్‌-కృష్ణపట్నం)లు మొత్తం 5,010 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. వీటిలో.. విజయవాడ ఎన్‌టీటీపీఎస్‌కు రోజుకి 24,600 టన్నుల బొగ్గు కావాలి.

మెరుగవ్వకుంటే కోతలు అనివార్యం

మెరుగవ్వకుంటే కోతలు అనివార్యం

ప్రస్తుతం ఇక్కడ 13,600 టన్నులే నిల్వ ఉంది. ఆర్‌టీపీపీకి రోజుకు 16,800 టన్నులు అవసరం కాగా, ఇక్కడ 69,100 టన్నుల నిల్వ (4 రోజులకు సరిపడా) మాత్రమే ఉంది. ఇక దామోదరం సంజీవయ్య పవర్‌ స్టేషన్‌కి రోజుకు 13,600 టన్నులు కావాలి. ఇక్కడ మాత్రమే 89,200 టన్నులు (7 రోజులకు సరిపడా) నిల్వ ఉంది. ఇలా బొగ్గు కొరత ఏర్పడడంతో మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలు ధరలు అమాంతం పెరిగాయి. కేవలం రూ.4 లేదా రూ.5కు వచ్చే యూనిట్‌ విద్యుత్‌కు ఇప్పుడు దాదాపు రూ.6 నుంచి పీక్‌ అవర్స్‌లో రూ.20 వరకూ వెచ్చించాల్సి వస్తోంది.

ప్రధానికి వివరించిన సీఎం జగన్..పరిస్థితి మారేనా

ప్రధానికి వివరించిన సీఎం జగన్..పరిస్థితి మారేనా

బొగ్గు సరఫరా చేస్తున్న మైనింగ్‌ సంస్థలకు మన జెన్‌కో రూ.1,500 కోట్ల బకాయిలు చెల్లించాలి. అదంతా కడితే తప్ప వారు పూర్తిస్థాయిలో సరఫరా చేయరు. దీనికి తోడు ఇప్పుడు బొగ్గు కొరత ఏర్పడింది. దీంతో..ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి ఈ పరిస్థితులను వివరిస్తూ లేఖ రాసారు. వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే, ఈ పరిస్థితికి వెంటనే పరిష్కార మార్గాలు కనిపించకపోతే ముందుగా విద్యుత్ కోతలు అమలు చేయక తప్పదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో సింగరేణి ఉండటంతో అంతగా ప్రభావం ఉండే పరిస్థితులు లేవని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం కేంద్రం స్పందన కోసం వేచి చూస్తోంది. దసరా పూర్తయిన తరువాత పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్ కోతల పైన ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

English summary
Coal crisis impact on ther power production in Andhra Pradesh. CM Jagan writes letter to Pm Modi over coal allocation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X