చంద్రబాబు కోర్టుకు అయ్యన్న, గంటా పంచాయతీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మధ్య ప్రచ్ఛన్న రాజకీయ యుద్ధం సాగుతోంది. వారి మధ్య వివాదం ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ముందుకు వచ్చింది. ఈ ఇరువురి మధ్య చాలా కాలంగా ప్రచ్ఛన్న సమరం సాగుతోంది.
ఆర్టీవోల బదిలీ వ్యవహారంతో వారి మధ్య విభేదాలు మరింతగా ముదిరాయి. విశాఖపట్నం ఆర్డీవోను బదిలీ చేసే విషంలో తెలుగుదేశం నాయకులు గొడవ పడిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సిఎంవో అధికారుల పట్ల మంత్రి అయ్యన్నపాత్రుడు, శాసనసభ్యుడు రామకృష్ణ వ్యవహరించిన తీరును చంద్రబాబుకు వారు వివరించారు.

కార్యాలయం తలుపులు తీసి మరి గొట్టిగా గొడవ పడ్డారని సిఎంవో అధికారులు చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. కాగా, అయ్యన్నపాత్రుడిపై ఫిర్యాదు చేసేందుకు కొంత మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు హైదరాబాదు చేరుకుంటున్నారు. రెవెన్యూ అధికారుల బదిలీలపై ఏ విధమైన సమాచారం కూడా గంటా శ్రీనివాస రావు తమకు ఇవ్వలేదని శాసనసభ్యులు చంద్రబాబుకు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడ్డారు.
విశాఖ ఆర్డీవో బదిలీ వివాదానికి రాజకీయ ప్రాధాన్యత లేదని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఉన్నతస్థాయి అధికారిని నియమించే ముందు స్థానిక మంత్రుల సంప్రదించాలని సూచించడంలో పాలనాపరమైన అంశమన్నారు. ఆర్డీవో రామచంద్రారెడ్డి చార్జ్ తీసుకోకుండా తాను అడ్డుకుంటున్నట్లు వచ్చిన వార్తలను మంత్రి ఖండించారు. తుపాను సహాయచర్యల్లో పాల్గొన్నవారికి సన్మానం తర్వాత సీఎం చేతుల మీదుగా బదిలీపై వచ్చిన వారు చార్జ్ తీసుకుంటే బాగుంటుందని తాను కలెక్టర్‌కు సూచించినట్లు మంత్రి గంటా స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి వైదొలిగిన దాడి వీరభద్రరావు గంటా శ్రీనివాసరావును కలుసుకున్నారు. అయితే, తాను వ్యక్తిగతంగానే గంటా శ్రీనివాసరావును కలిసినట్లు ఆయన తెలిపారు. దాడి వీరభద్ర రావు తెలుగుదేశం పార్టీలోకి తిరిగి రావడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం చేకూరింది. మంగపతిరావు కూడా శనివారంనాడు గంటా శ్రీనివాస రావుతో సమావేశమయ్యారు. పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు టిడిపిలోకి రావడానికి గంటాతో చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications