సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా సిఫార్సు: కేవీ విశ్వనాథన్ కూడా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా(పీకే మిశ్రా)ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియామకం కోసం సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ పేరును కూడా సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించింది.
కొలీజియం సిఫార్సును ప్రభుత్వం అంగీకరిస్తే.. జస్టిస్ జేబీ పార్దివాలా ఆగస్టు 11, 2030న పదవీ విరమణ చేసిన తర్వాత విశ్వనాథన్ భారత అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా నియమితులై మే 25, 2031 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. వీరి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపిన తర్వాత న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదించాల్సి ఉంటుంది. సాధారణంగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను న్యాయశాఖ ఆమోదిస్తూ ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది . ఈ మేరకు మే 16న సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో తీర్మానాన్ని అప్‌లోడ్ చేసింది. జస్టిస్ మిశ్రా అక్టోబర్ 13, 2021న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం తీర్మానం ప్రకారం .. అర్హులైన ప్రధాన న్యాయమూర్తులు, ఉన్నత న్యాయస్థానాల సీనియర్ న్యాయమూర్తుల యోగ్యత, సమగ్రత, సామర్థ్యాలను జాగ్రత్తగా మూల్యాంకనం చేసిన తర్వాత అనేక పరిగణనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోబడింది.
ఐదుగురు సభ్యుల కొలీజియం ప్రకారం.. సుప్రీంకోర్టు ప్రస్తుతం 32 మంది న్యాయమూర్తులతో పనిచేస్తుండగా.. దీని ఆమోదిత సామర్థ్యం 34 మంది న్యాయమూర్తుల వద్ద ఉంది. ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు-జస్టిస్ దినేష్ మహేశ్వరి, ఎంఆర్ షా- గత రెండు రోజుల్లో పదవీ విరమణ చేశారు.
జస్టిస్‌లు సంజయ్ కిషన్ కౌల్, కేఎం జోసెఫ్, అజయ్ రస్తోగి, సంజీవ్ ఖన్నాలతో కూడిన కొలీజియం ఆమోదించిన తీర్మానం జూలై రెండో వారం నాటికి అదనంగా మరో నాలుగు ఖాళీలు ఏర్పడతాయని పేర్కొంది. దీంతో పని చేసే న్యాయమూర్తుల సంఖ్య 28కి తగ్గనుంది.












Click it and Unblock the Notifications