పోస్ట్‌మ్యాన్ నిర్లక్ష్యం ఖరీదు.. ఓ యువకుడి ఉద్యోగం
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంలో పోస్ట్ మ్యాన్ చేసిన నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది తమ బంగారు భవిష్యత్తుని కోల్పోయారు. అంతేకాదు పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది జీవితాలు చిందరవందర అయ్యాయి. వివరాల్లోకి వెళితే ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం గొల్లపల్లి గ్రామ పరిధిలోని రామకృష్ణాపురం పంచాయతీ పరిధిలో జరిగింది.
గత మూడు సంవత్సరాలుగా గ్రామంలోని ప్రజలకు పోస్ట్ మ్యాన్ ద్వారా ఎలాంటి సమాచారం అందలేదు. గ్రామంలో అందజేయాల్సిన ఆధార్ కార్డులు, బ్యాంకు చెక్కు బుక్‌లు, డిడిలు, ఇంటర్యూ లెటర్లు, అపాయింట్‌మెంట్ లెటర్లు, పెళ్లి లేఖలు ఇలా అన్ని బట్వాడా ఆగిపోయింది.

ఇలా ఒకటేమిటి అన్ని రకాల ముఖ్య సమాచారాన్ని గ్రామ ప్రజలకు చేర్చకుండా, గోనె సంచిలో వేసి మిద్దపై పడేశాడు. దీంతో అవి ఎండకు ఎండి, వానకు తడిచి పాడైపోయాయి. కొన్ని కారణాల వల్ల మంగళవారం ఆ విషయం బయటకు రావడంతో గ్రామస్తులు వచ్చి తమకొచ్చిన లేఖలను, కవర్లను ఏరుకున్నారు.
విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించకుండా, తమకు అన్యాయం చేసిన పోస్ట్ మ్యాన్‌ను కఠనంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆధార్ కార్డులు లేక పోవడం వల్ల గ్రామంలో చాలా మందికి పెన్షన్ మంజూరు కాలేదని పేర్కొన్నారు. దీంతో పాటు యువకులు పాయింట్‌మెంట్ లెటర్లు అందక పోవడం వల్ల విలువైన ఉద్యోగాలను కూడా కోల్పోయారని తెలిపారు.












Click it and Unblock the Notifications