చంద్రబాబును కలిసిన సీనియర్ కాంగ్రెస్ నేత కుమారుడు
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రణాళికలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో దారుణ పరాభవం నుంచి ఆ పార్టీ కోలుకుంటోంది. బాబు రోడ్ షోలకు, సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వ్యక్తమవుతుండటంతో అధికారం దక్కుతుందనే ఆశతో ఆ పార్టీ నేతలున్నారు. చంద్రబాబు కూడా గత ఎన్నికల్లో తాము ఎక్కువగా ఏయే అంశాలవల్ల నష్టపోయామో గమనించి వాటిని చక్కదిద్దుకుంటూ వస్తున్నారు.

రిజర్వుడు నియోజకవర్గాల్లో పరాభవం
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో దారుణమై ఫలితాలను చవిచూసింది. దాదాపుగా అన్ని రిజర్వుడు నియోజకవర్గాల్లోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ప్రభంజనాన్ని చాటింది. ముఖ్యంగా పార్టీకి పట్టున్న ఉభయ గోదావరి జిల్లాల్లోను పరాభవం ఎదురైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి మంచి బలముంది. అయినప్పటికీ గత ఎన్నికల్లో పార్టీ టికెట్ పై పోటీచేసిన స్టాలిన్ ఓటమి పాలయ్యారు. పార్టీ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు రావడంతో ఆయన టీడీపీని వీడారు.

వ్యతిరేకతను అనువుగా మార్చుకోలేరా?
బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం ఇన్ ఛార్జిని నియమించలేదు. ఏడాదిన్నర ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తోన్న బాబు ఇక్కడ మాత్రం తన పాత వైఖరినే కనపరిచారు. దీనిపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కొండేటి చిట్టిబాబుపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని, 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఈ విషయం స్పష్టంగా అవగతమవుతోందని, ఇటువంటి తరుణంలోనే వ్యతిరేకతను టీడీపీకి అనువుగా ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.

చంద్రబాబును కలిసిన శ్రీరాజ్
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్ నాలుగు రోజుల క్రితం అధినేత చంద్రబాబునాయుణ్ని కలిశారు. పి.గన్నవరం టికెట్ అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు ఏం చెప్పారనేదానిపై స్పష్టత రాలేదు. కొద్దిరోజుల క్రితం వరకు హర్షకుమార్ వైసీపీలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ ఆయన వాటిని ఖండించారు.
హర్షకుమార్ కు జిల్లావ్యాప్తంగా అనుచర గణం ఉంది. అంతేకాకుండా రెండుసార్లు ఎంపీగా కొనసాగడంతో కేంద్రంలోను మంచి పరిచయాలున్నాయి. ఇన్ఛార్జిని ముందే ప్రకటిస్తే ఎవరైనా అసంతృప్త నేతలుంటే ఇప్పుడే తెలిసిపోతుందని, సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే శ్రీరాజ్ కు సీటు ఇస్తారా? లేదా? అనే విషయంపై చంద్రబాబు స్పష్టతనివ్వలేదు. నామినేషన్లు వేసే చివరి తేదీవరకు నాన్చొద్దని, అభ్యర్థిని ముందే ప్రకటించాలని నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు చంద్రబాబును కోరుతున్నాయి.












Click it and Unblock the Notifications