చివరి సిఎం చిరు? రాష్ట్రపతి పిలుపు: కాంగ్రెస్ లెక్కలు

రాష్ట్రపతి పాలన, కొత్త ప్రభుత్వంపై లెక్కలు వేసుకున్న కాంగ్రెసు... ప్రభుత్వం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతోంది. సీమాంధ్రలో ప్రాంతంలో పార్టీ ప్రతిష్ఠను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల పైనా దృష్టి సారించింది. ఇందులో భాగంగా సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులతో వరుస చర్చలు జరుపుతోంది. చిరంజీవి సిఎం రేసులో ముందంజలో ఉన్నారు. ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ, బొత్స సత్యనారాయణ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
వీరంతా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఈ సామాజిక వర్గాలను దగ్గర చేసుకుని, సంప్రదాయ ఓటు బ్యాంకుతో గట్టెక్కాలనుకుంటోంది. కొత్త సిఎం ఎంపిక, పార్టీ బలోపేతంపై భవిష్యత్ కార్యాచరణను రూపొందించటంపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. సీమాంధ్ర నేతలతో వరుస చర్చలు జరుపుతోంది. సోమవారం బొత్స, కేంద్ర మంత్రులు కావూరు, పళ్లం రాజు, జెడి శీలం, ఎంపి కెవిపి రామచంద్ర రావు, స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి 146 మంది సభ్యుల బలం ఉందని, ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వలసలు ఉండబోవని అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం అందరికీ ఆమోదయోగ్యమైన ముఖ్యమంత్రిని నియమించి హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీలతో కలిపి ఎపికి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోందట. పిటిఐ వార్తా సంస్థ సైతం ప్రస్తుతానికి ఎపిలో లోక్‌సభకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయని, అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత నిర్వహించవచ్చునని పేర్కొంది.
బొత్సతో భేటీ అనంతరం కిరణ్ పార్టీ పెడితే ఆయన వెంట నడిచే శాసనసభ్యులెందరు? రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం మంచిదా? ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వంగా ప్రజల ముందుకు వెళ్లడం మంచిదా? సీమాంధ్రకు ఇప్పుడు ప్రకటించిన ప్యాకేజీతోకి అదనంగా ఇంకా ఏమైనా కావాలా? అనే అంశాలపై సీమాంధ్ర ప్రాంత మంత్రుల నుంచి సమాచారం సేకరించాలని దిగ్విజయ్ సింగ్ నిర్ణయించారు.
మంగళవారం ఢిల్లీకి రావాలంటూ సుమారు 12 మంది సీనియర్ మంత్రులకు ఢిల్లీ నుంచి పిలుపు అందింది. తెలుగుదేశంలో చేరేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తున్న, ఇప్పటికీ కిరణ్‌తో టచ్‌లో ఉన్న శైలజానాథ్, పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేశ్‌లకు మాత్రం పిలుపు రాలేదు. కిరణ్ వెంట నడిచే అవకాశమున్న మంత్రుల గురించి ఆరా తీశారు.
మరోవైపు అధిష్టానం పిలుపుతో హుటాహుటిన ఢిల్లీకి చేరిన చిరంజీవికి తనను కలవాలంటూ రాష్ట్రపతి నుండి ఆహ్వానం వచ్చింది. మంగళవారం సాయంత్రం అయిదున్నర గంటలకు రాష్ట్రపతితో చిరు భేటీ కానున్నారు. ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రభుత్వం ఉంటేనే మేలని చాలామంది నేతలు అధిష్టానానికి సూచిస్తున్న నేపథ్యంలో చిరు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications