నాయకత్వ మార్పుపై ఏపీ కాంగ్రెస్ క్లారిటీ ఇదీ: గాంధీ కుటుంబానికి విధేయులా? లేక: శైలజానాథ్ లేఖ
అమరావతి: అఖిల భారత కాంగ్రెస్ కమిటీగా తాత్కాలిక అధినేత్రిగా నియమితులైన సోనియా గాంధీ.. పదవి నుంచి తప్పుకొంటారంటూ వార్తలు వస్తోన్న వేళ.. ఏఐసీసీ అత్యున్నత విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానున్న సమయంలో.. కొత్త నేతకు పగ్గాలను అప్పగిస్తారంటూ ప్రచారం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ కాంగ్రెస్ నేతల వైఖరేంటీ? పీసీసీ నాయకులు కొత్త నాయకత్వాన్ని స్వాగతిస్తారా? గాంధీ కుటుంబానికే విధేయులుగా ఉంటారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అనుమానాలను తెర దించారు కాంగ్రెస్ నాయకులు.
కాంగ్రెస్ పగ్గాలు ముళ్లకిరీటమే? తప్పుకోనున్న సోనియా?.. ఖర్గే, శశిథరూర్ ఫ్రంట్రన్నర్లుగా

గాంధీ కుటుంబం వైపే
ఏపీ కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ కుటుంబం వైపే మొగ్గు చూపారు. కాంగ్రెస్ అధినేత్రిగా సోనియా గాంధీ కొనసాగి తీరాల్సిందేనంటూ తీర్మానించారు. పార్టీ అధినేత్రిగా కొనసాగాలంటూ విజ్ఙప్తి చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకోవాల్సి వస్తే మాత్రం.. వారసుడిగా రాహుల్ గాంధీ పేరును ప్రకటించాలని కోరారు. కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా సోనియాగాంధీకి లేఖ రాశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ వేర్వేరుగా సోనియా గాంధీకి లేఖలను పంపారు. గాంధీ కుటుంబం నుంచి పార్టీ పగ్గాలు చేజారకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఏకగ్రీవ తీర్మానం..
కాంగ్రెస్ అధినేత్రిగా శక్తమంతులైన సోనియా గాంధీ నాయకత్వంలో పని చేయడానికి ఏపీ కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నారని శైలజానాథ్ పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో సోనియాగాంధీ మాత్రమే పార్టీ అధ్యక్ష పదవికి సమర్థులైన నాయకురాలనే విషయాన్ని తాము గట్టిగా విశ్వసిస్తున్నామని చెప్పారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనప్పటికీ.. దాన్ని విజయవంతంగా అధిగమించగల శక్తి, సామర్థ్యాలు సోనియాగాంధీకి ఉన్నాయని అన్నారు. ప్రజాస్వామ్య పునాదులు బలహీనపడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి సోనియా గాంధీ కుటుంబం మాత్రమే సారథ్యాన్ని వహించాల్సి ఉంటుందని అన్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లో..
ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుకోవాల్సి వస్తే.. తదుపరి పార్టీ అధి నాయకుడిగా రాహుల్ గాంధీ పేరును ఖరారు చేయాలని శైలజానాథ్ సూచించారు. రాహుల్ గాంధీ పేరును ప్రకటిస్తారని ఏపీ కాంగ్రెస్ నమ్ముతోందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించగల నాయకుడు మరొకరు లేరని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం పార్టీలో ఉత్సాహాన్ని నింపేలా, క్షేత్రస్థాయి నుంచి క్యాడర్‌ను పునరుత్తేజితులను చేసే సామర్థ్యం మరొకరిలో కనిపించట్లేదని తాము భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాంటి చాకచక్యం రాహుల్ గాంధీలో మాత్రమే ఉందని తేల్చి చెప్పారు.

లౌకికవాద ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో..
దేశంలో ప్రజాస్వామ్య పునాదులు ప్రమాదంలో పడ్డాయని శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. లౌకికవాద ప్రజాస్వామ్య మనుగడకు సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. రాజ్యాంగాన్ని నిర్వీర్య పరిచే శక్తులు ఆవిర్భవిస్తున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగపరంగా, ప్రజాస్వామ్య పరంగా దేశం ఇంతకు ముందు ఎప్పుడూ లేని అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందని శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలు కాంగ్రెస్‌కు అండగా నిల్చుంటున్నారని చెప్పారు. సోనియా, లేదా రాహుల్ గాంధీల నాయకత్వంలోనే ప్రజల అకాంక్షలు నెరవేరుతాయని పేర్కొన్నారు.

యూత్ కాంగ్రెస్ కూడా..
ఏపీ యూత్ కాంగ్రెస్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో కాంగ్రెస్ అత్యంత శక్తిమంతంగా ఎదుగుతుందని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ తెలిపారు. ఇలాంటి సమయంలో సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ మాత్రమే కాంగ్రెస్ పగ్గాలను స్వీకరించాల్సి ఉంటుందని అన్నారు. సంక్షోభ సమయంలో పార్టీకి సరైన మార్గదర్శనాన్ని చేయగల సామర్థ్యం వారిద్దరికి మాత్రమే ఉందని చెప్పారు. తాము సోనియాగాంధీ లేదా రాహుల్ గాంధీల నాయకత్వాన్ని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.