కెసిఆర్‌పై కాంగ్రెసు సీనియర్లు కాకా, ఎమ్మెస్ ధ్వజం
న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కాంగ్రెసు సీనియర్లు ఎం. సత్యనారాయణరావు, జి. వెంకటస్వామి (కాకా) ధ్వజమెత్తారు. కెసిఆర్ వల్ల తెలంగాణ రాలేదని వారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణం సోనియా గాంధీనే అని వారు సోమవారంనాడు అన్నారు.
తెరాసను మునిగిపోయే నావగా వారు అభివర్ణించారు. కాంగ్రెసులో పార్టీని విలీనం చేయకపోవడానికి, కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోకపోవడానికి కెసిఆర్‌కు ముఖ్యమంత్రి పదవిపై ఆశపెరగడమే కారణమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది కాబట్టి తన కుమారులు వివేక్, వినోద్ తిరిగి కాంగ్రెసులోకి వచ్చారని కాకా చెప్పారు.

పొత్తు ఉండదు
తెలంగాణ రాష్ట్ర సమితి తో పొత్తులు ఉండవని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు స్పష్టం చేశారు. కెసిఆర్ పూటకో విధంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కెసిఆర్ రోజుకో మాట మాట్లాడుతూ సొంత కవిత్వం చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. సీపీఐతో పొత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో తనను కెసిఆర్ గాడ్ ఫాదర్ అన్నారని, ఇప్పుడు అది పోయి, నా కుటుంబం కావాలి, నేనే నాయకుడని అంటున్నారని విహెచ్ అన్నారు. అలాంటి వ్యక్తితో పొత్తులు కుదరవని హనుమంతరావు వెల్లడించారు.












Click it and Unblock the Notifications