ఢిల్లీ ధర్నా తర్వాత జగన్, కాంగ్రెస్ మైండ్ గేమ్ ? షర్మిల అలర్ట్..!
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక చోటు చూసుకుంటున్న పరిణామాలు సహజంగానే విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఇండీ కూటమివైపుకు తీసుకెళ్తున్నాయి. అయితే ఇండీ కూటమిని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఏపీ అధ్యక్షురాలిగా ఉన్ చెల్లెలు షర్మిలతో వైరం మాత్రం ఆయన దూకుడుకు బ్రేక్ వేస్తోంది. అదే సమయంలో ఢిల్లీలో వైసీపీ ధర్నాకు మద్దతివ్వని కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం పాటిస్తుండగా.. జగన్ మాత్రం కాంగ్రెస్ మద్దతివ్వకపోవడాన్ని ప్రశ్నిస్తూ మరో మైండ్ గేమ్ మొదలుపెట్టారు.
రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వైసీపీ టార్గెట్ గా సాగుతున్న హింసను నిరసిస్తూ ఢిల్లీలో ఆ పార్టీ భారీ ధర్నా నిర్వహించింది. దీనికి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేతో పాటు విపక్ష ఇండీ కూటమి పార్టీల్ని సైతం ఆహ్వానించింది. అయితే ఎన్డీయేలో ఉన్న టీడీపీకి వ్యతిరేకంగా మిత్రపక్షాలు గొంతెత్తే అవకాశం లేదు కాబట్టి ఈ ధర్నాకు దూరంగా ఉండిపోయాయి. కానీ విపక్ష ఇండీ కూటమిని నడిపిస్తున్న కాంగ్రెస్ కూడా రాలేదు. అయితే ఇదే ఇండీ కూటమిలోని కీలక పార్టీలన్నీ తమ ప్రతినిధుల్ని పంపాయి. తద్వారా కొత్త సమీకరణాలకు బీజం పడింది.

ఢిల్లీ ధర్నాకు రాని కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత కూడా ఏపీలో హింసపై స్పందించలేదు. కానీ జగన్ మాత్రం నిన్న ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ వైసీపీ ధర్నాకు దూరంగా ఉండిపోవడాన్ని ప్రశ్నించారు. తమ ప్రత్యర్ధులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో హింస జరిగితేనే స్పందిస్తారా అంటూ మణిపూర్ ను ఉదాహరణగా చూపుతూ కాంగ్రెస్ ను నిలదీశారు. తద్వారా ఏపీలో హింసపై కాంగ్రెస్ పార్టీ తప్పకుండా స్పందించేలా ఉసిగొల్పుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా జగన్ చెల్లెలు, తమ పార్టీ నేత షర్మిల పీసీసీ ఛీఫ్ గా ఉంటూ పోరాడుతున్న సమయంలో ఆయన్ను వెంటనే అక్కున చేర్చుకునేందుకు ఇష్టపడటం లేదు. అంతే కాదు గతంలో తమ పార్టీని కాదని వెళ్లిపోయి ఏపీలో దారుణంగా దెబ్బతీసిన జగన్ ను చివరి ప్రయత్నంగా మాత్రమే కలుపుకోవాలని భావిస్తోంది.
దీంతో అటు కాంగ్రెస్, ఇటు జగన్ ఇద్దరూ మైండ్ గేమ్ ప్రారంభించారు. ఇది అంతిమంగా తనపైనే ప్రభావం చూపుతుందని భావిస్తున్న పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల అలర్ట్ అవుతున్నారు. పార్టీ నేతలతో జగన్ ఢిల్లీ ధర్నాపై ఆరా తీశారు. ఇండీ కూటమిలోకి జగన్ వస్తే తన పరిస్దితి ఎలా ఉండబోతోంది, అలాగే కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేస్తే తనను పక్కనబెట్టమని కోరతారా అన్న అంశాలపై దృష్టిసారించారు. ప్రస్తుతానికి హైకమాండ్ నుంచి అందే ఆదేశాల ప్రకారం తాజా పరిణామాలపై స్పందించాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications