విభజన గాయం ఏపీకి..! ఫలితాలు కాశ్మీర్‌కు!!: మోడీ నయా రాజకీయం?
రాష్ట్రాన్ని విభజించిన గాయం ఏపీకి ఇంకా మనలేదు. కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ కానీ, తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కానీ ఆ గాయాన్ని సజీవంగానే ఉంచుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ పోటీపడ్డాయి. ఈ క్రమంలోనే అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ-2 ఏపీకి ఎన్నో హామీలిచ్చింది. ప్రత్యేక హోదా, పోలవరంలాంటివెన్నో ఉన్నాయి.

నియోజకవర్గాల పెంపు అలాగే ఉంది!
నాయకులు ఎవరి రాజకీయ భవితవ్యం వారు చూసుకోవడంతో రాష్ట్రానికి ఏం సాధించాలనే విషయాన్ని గాలికొదిలేశారు. ఢిల్లీలో జీహుజూర్ అని ఏపీకి వచ్చి సమైక్య రాష్ట్రమంటూ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. రాష్ట్రం విభజించడం ఖాయమని తేలినా కనీసం మనకు కావల్సినవాటిని సాధించుకోవడంపై కూడా దృష్టిపెట్టలేదు.
2014 విభజన చట్టంప్రకారం ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలను 225కు, తెలంగాణలోని 119 నియోజకవర్గాలు 153కు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఆ దిశగా చిన్న పని కూడాప్రారంభం కాలేదు.

ఎన్నిసార్లు అడిగినా జనాభా లెక్కల సేకరణ అంటారు?
రెండు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పార్లమెంటులో ఎన్నిసార్లు అడిగినప్పటికీ జనాభ లెక్కల సేకరణను సాకుగా చూపుతూ తమకు రాజకీయంగా కలిసిరానిదాన్ని ఎందుకు చేయాలనే ధోరణిలో ఎన్డీయే ప్రభుత్వం కాలం నెట్టుకుంటూ వస్తోంది. కానీ జమ్ము కాశ్మీర్ లో నియోజకవర్గాలను పెంచడానికి కేంద్రం తాజాగా జీవో జారీచేసింది. రెండు తెలుగు రాష్ట్రాలపై లేని ప్రేమ కాశ్మీర్‌కు ఎందుకంటే అక్కడ అధికారంలోకి రావడం సులువనేది బీజేపీ ఢిల్లీ పెద్దల అభిప్రాయంగా ఉంది.

జమ్ముకాశ్మీర్లో సీట్లు పెంచుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు పెంచరు?
అసోం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోను నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ఒకే నోటిఫికేషన్ జారీచేయడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. జమ్ముకశ్మీర్‌కు 2011, ఇతర రాష్ట్రాలకు 2001 జనాభా లెక్కల సేకరణను పరిగణనలోకి తీసుకున్నారు. ఒకరకంగా ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని మేధావులు అంటున్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల సేకరణ ప్రకారం ఏపీ, తెలంగాణలో సీట్లు పెంచుతామని మోడీ సర్కార్ చెబుతోంది.

లాభనష్టాలను బేరీజు వేసుకొని..
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కు ఈ రెండు రాష్ట్రాల్లో లాభనష్టాలను బేరీజు వేసుకుందని, నియోజకవర్గాలు పెంచినా తమకు రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం ఉండదని భావించబట్టే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరు.
సీట్లను 153కు పెంచితే ఇంకా అభ్యర్థులు దొరకరు. అలాగే ఏపీలోను ఇదే పరిస్థితి. కాస్తో కూస్తో తెలంగాణలోనే నయం. అధికారంలో ఉన్న మోడీ సర్కార్ తనకు ఇష్టమైన కాశ్మీర్ పై ఒకప్రేమ, ఏపీ, తెలంగాణపై సవతిప్రేమను చూపిస్తున్నప్పటికీకి గట్టిగా అడిగేవరెవరూ లేకపోవడమే భారతదేశ ప్రజాస్వామ్యంలో వైచిత్రి.












Click it and Unblock the Notifications