సినిమాను చూసి: అమెరికా వెళ్లేందుకు చెన్నై టెక్కీ కిడ్నాప్ డ్రామా, నెల్లూర్లో దాచారు
చెన్నై/నెల్లూరు: అమెరికా వెళ్లేందుకు ఇద్దరు సాఫ్టువేర్ ఇంజనీర్లు అడ్డదారి తొక్కి, పోలీసులకు చిక్కారు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. అమెరికా వెళ్లాలని టెక్కీలు మనోజ్ కుమార్ భావించాడు.
అందుకు అవసరమైన డబ్బులు సంపాదించడానికి... రెండేళ్ల బాలుడిని అపహరించి ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు తరలించారు. పోలీసులు కొన్ని గంటల్లోనే ఆ నిందితులను పట్టుకుని, బాలుడిని సురక్షితంగా చెన్నైకి తీసుకొచ్చారు.
ఆవడి సమీపంలోని అన్ననూర్‌కు చెందిన శంకర్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆయన భార్య జయనందిని, రెండేళ్ల కుమారుడు మోహిత్‌తో అన్ననూర్‌లోని ఓ అపార్టుమెంటులో ఉంటున్నారు. శంకర్ వారానికోసారి చెన్నైకి వచ్చి వెళ్తుంటారు.
అదే అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఇరవై అయిదేళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీరు మనోజ్ చిన్నారి మోహిత్‌తో సన్నిహితంగా ఉండేవాడు. ఆదివారం మోహిత్‌ను తన కారులో బయటకు తీసుకెళ్లిన మనోజ్.. చాలాసేపటి వరకు తిరిగి రాలేదు.

పోలీసులకు ఫోన్ చేసిన మనోజ్ కారులో వస్తున్న తనపై ఆరుగురు దుండగులు దాడి చేశారని, కారుతో పాటు బాలుడిని అపహరించారని సమాచారం ఇచ్చాడు. పోలీసుల విచారణలో బాలుడి అపహరణలో మనోజ్ ప్రధాన సూత్రధారి అని తేలింది.
మనోజ్ అమెరికా వెళ్లేందుకు రూ.3 లక్షలు అవసరమైందని, అందులో రూ.1.5 లక్షలను సర్దుబాటు చేయగా మిగిలిన నగదు కోసం ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు తేలింది. మిత్రుడు, కుమార వేల్ (23) సహాయంతో మనోజ్ బాలుడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
కుమారవేల్ బాలుడితో సహా నెల్లూరులో ఉన్నట్లు గుర్తించి, బాలుడిని రక్షించారు. ఇద్దర్ని అరెస్టు చేశారు. కాగా నిందితులు ఓ తమిళ చిత్రంలో ఇలాంటి కిడ్నాప్ డ్రామాను చూసి, ఆ తర్వాత వారు అదే పని చేశారని పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications