Coronavirus andhra pradesh tdp ysrcp bonda uma maheswar rao budda venkanna vijaya sai reddy కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ టీడీపీ వైసీపీ బోండా ఉమ బుద్దా వెంకన్న విజయసాయి రెడ్డి politics
చుక్కలు చూపించిన టీడీపీ నేతలు.. వైసీపీ వివాదాస్పద వార్నింగ్.. ఏపీలో పొలిటికల్ వైరస్
''వైస్ జగన్ అనే అవినీతి రథానికి రెండు చక్రాలే విజయసాయి రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కరోనా వేళలోనూ వైసీపీ నేతల కాసుల వేట కొనసాగుతోంది. లాక్ డౌన్ కారణంగా జనం తిండి లేక ఇబ్బందులు పడుతోంటే, జగన్ మాత్రం మద్యం తయారీకి అనుమతులిచ్చారు. కరోనా వైరస్ పుట్టిన చైనాలోనే కేసులు తగ్గిపోయాయి. కానీ వైసీపీ తీరువల్ల ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కేసులు పెరుగుతున్నాయి. అదేమంటే కరోనాతో సహజీవనం తప్పదని జగన్ అంటున్నారు. సీఎం స్థాయిలో ఆయన చెప్పిన మాటలు విని జనం పగలబడి నవ్వుకుంటున్నారు'' అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు.

పోలీసులకూ అడ్డంగా..
పేదలు, అత్యవసర విధుల్లోని సిబ్బందికి ఆహారం పంచిన టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్టు చేసిన ఘటనలపై ఏపీలో వివాదం చెలరేంగింది. టీడీపీ నేతలు ఘాటు విమర్శలతో ప్రభుత్వానికి చుక్కలు చూపించగా, వైసీపీ కూడా అంతకు మించిన స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ఈ క్రమంలో రెండు పార్టీలూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాయి. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. లాక్ డౌన్ సమయంలో పోలీసులు మాత్రమే సరిగ్గా పనిచేస్తున్నప్పటికీ, వాళ్లకు అధికార పార్టీ నేతలు అడుగడుగునా అడ్డం పడుతున్నారని, ఎక్కడ తంటాలు పడాల్సి ఉంటుందోనని పోలీసులు మిన్నకుండిపోతున్నారని బుద్ధా అన్నారు. పలు జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ ఆదేశాలు ధిక్కరించడాన్ని ఆయన గుర్తుచేశారు.

చట్టం వైసీపీకి చుట్టం..
వైసీపీ ఎమ్మెల్యేలు యధేచ్ఛగా లాక్ డౌన్ ధిక్కరిస్తూ ట్రాక్టర్లతో ర్యాలీలు, ప్రారంభోత్సవాలు జరుపుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని, అదే సమయంలో ప్రజల ఆకలి తీర్చడానికి టీడీపీ నేతలు నిత్యావసర సరుకుల్ని పంచితేమాత్రం అపిడమిక్ చట్టం కింద కేసులు పెడుతున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో చట్టం వైసీపీకి చుట్టంగా మారిందని విమర్శించారు. అధికార పార్టీకి పోలీసులు బానిసలుగా ఉండరాదంటూ బోండా హితవు పలికారు.

మూడు నెలల్లో అడ్రస్ గల్లంతు
బోండా ఉమ, బుద్ధా వెంకన్నలకు కౌంటర్ ఇచ్చేక్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వివాదాస్పద రాతలు రాశారు. ఇంకో మూడు నెలల్లో అడ్రస్ లేకుండా పోతారంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. అంతేకాదు, టీడీపీ నేతల్ని చిల్లర దొంగలతో పోల్చారు. ‘‘సైకిల్ బెల్స్, కొబ్బరి చిప్పలు ఎత్తుకుపోయే చిల్లర దొంగలను చేరదీసి పదవులిచ్చినందుకు చంద్రబాబుకు ప్రజల చేతిలో పెద్ద శాస్తే జరిగింది. రౌడీ షీట్లు మూసేయించినా బుద్ధులు మారవు కదా. కన్నాలేసే గుణం ఎక్కడికి పోతుంది! ఇంకో మూడ్నాలుగు నెలలే వారి ఆగడాలు. తర్వాత అడ్రసు లేకుండా పోతారు''అని విజయసాయి వార్నింగ్ ఇచ్చారు.

వైఎస్సార్‌తో జగన్‌ను పోల్చుతూ..
ఆదివారం(మే 3) ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు జర్నలిస్టులకు విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడైన ప్రస్తుత సీఎం జగన్ లకు పోలిక పెడుతూ చంద్రబాబు విమర్శలు చేశారు. పత్రికా స్వేచ్ఛను అణిచేయడానికి నాటి వైఎస్ హయాంలో జీవో 938 తీసుకొస్తే, ఇవాళ జగన్ జీవో 2430 అమలు చేస్తున్నారని, తండ్రీ కొడుకుల ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం చేసింది, చేస్తున్నది టీడీపీనే అని బాబు గుర్తుచేశారు.