ఏపీలో 420కి పాజిటివ్ కేసులు: ఆ 2 జిల్లాల్లోనే 166, ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీకి విద్యార్థులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే మరో 15 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 420కి పెరిగిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కేసుల్లో కూడా ఎక్కువగా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబసభ్యులే ఉన్నట్లు సమాచారం.

420కి కరోనా కేసులు
రాష్ట్రంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరు లో 7, నెల్లూరు లో 4, కర్నూల్ లో 2, చిత్తూరు, కడప జిల్లాలో ఒక్కొక కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 15 కేసుల తో రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 420 కి పెరిగిందని వైద్యారోగ్యశాఖ పేర్కొంది.

ఆ రెండు జిల్లాల్లోనే 166
కాగా, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. కర్నూలులో ఒక్క వారం రోజుల్లోనే 80 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో సైతం భారీగా కేసులు నమోదవుతు్ననాయి. కరోనా సోకిన బాధితుల్లో ఎక్కువ మంది ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లివచ్చినవారు, వారితో కాంటాక్ట్ అయిన వారుగా తెలుస్తోంది. కర్నూలులో అత్యధికంగా 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, గుంటూరులో 82 కేసులు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లోనే 166 కేసులు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో 420 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 401 మంది చికిత్స తీసుకుంటున్నారు.

ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని ఏపీ విద్యార్థులు రాష్ట్రానికి..
ఇటలీ దేశం నుంచి కొద్ది రోజుల క్రితం స్వదేశానికి వచ్చి ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో చిక్కకున్న 33 మంది తెలుగు విద్యార్థులు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఏపీ సీఎస్ నీలం సాహ్ని తెలుగు విద్యార్థులను రాష్ట్రానికి క్షేమంగా తీసుకొచ్చేందుకు చొరవతీసుకున్నారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఐఏఎస్ అధికార కృష్ణబాబు.. రాయపూర్, జగదల్పూర్ మీదుగా సోమవారం విశాఖకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులను ఏపీకి తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రత్యేక చొరవ చూపారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం మొదట విద్యార్థులను పంపించేందుకు నిరాకరించినప్పటికీ ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపి తెలుగు విద్యార్థులను స్వరాష్ట్రానికి తీసుకొస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications