ఏపీలో 143కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు: ఒక్కరోజులోనే 32 కొత్త కేసులు, జిల్లాల వారీగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఢిల్లీకి వెళ్లి వచ్చినవారితో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. నిన్నమొన్నటి వరకు పదులు సంఖ్యలోనే ఉన్న కరోనా పాజిటివ్ కేసులు.. ఒక్కసారిగా వంద దాటిపోయాయి. దీంతో ఏపీ ప్రజల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది.

ఒక్క రోజులోనే 32 కొత్త కేసులు..
కాగా, గురువారం ఒక్క రోజే మొత్తం 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఉదయం బులెటిన్లో 21, మధ్యాహ్నం బులెటిన్లో 3, సాయంత్రం బులెటిన్లో 8 మందికి కరోనా సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 143కు చేరుకుంది. మరో 409 మంది రిపోర్టులు రావాల్సి ఉంది.

జిల్లాల వారీగా ఇలా..
ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం మినహా అన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 23 మందికి కరోనా సోకింది. నెల్లూరులో 21, గుంటూరులో 20, ప్రకాశంలో 17, కడపలో 16, పశ్చిమగోదావరిలో 14, విశాఖపట్నంలో 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా కేసుల పెరుగుతుండటంతో..
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో టెస్టింగ్ సెంటర్లను కూడా సర్కారు పెంచింది. ఇప్పటి వరకు నాలుగు టెస్టింగ్ సెంటర్లు ఉండగా.. ఇప్పుడు అదనంగా గుంటూరు, కడపలో ఒక్కో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 4 నుంచి ఈ రెండు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కేంద్రాలు కూడా అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో పరీక్షల సామర్థ్యం రోజుకు 140 నుంచి 570కి పెరగనుంది. విశాఖపట్నంలో కూడా మరో టెస్టింగ్ సెంటర్‌ను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Recommended Video

నిజాముద్దీన్ ప్రభావం.. దేశ వ్యాప్తంగా పెరిగిన కేసులు..
ఇక దేశ వ్యాప్తంగా 1965 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 151 మంది కోలుకోగా.. 41 మంది మృతి చెందారని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో కరోనావైరస్ అంతగా ప్రభావం లేదనుకుంటున్న తరుణంలో ఢిల్లీలోని నిజాముద్దీన వద్ద వేలాది సంఖ్యలో ముస్లింలు ప్రార్థనలు చేయడం.. అందులో కరోనా పాజిటివ్ ఉన్న విదేశీయులు పాల్గొనడంతో ఒక్కసారిగా కేసుల సంఖ్య దేశంలో పెరిగిపోయింది. ఈ ప్రార్థనల్లో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారు పాల్గొనడం గమనార్హం. దాదాపు వీరితో 500 పాజిటివ్ కేసులు పెరగడం గమనార్హం.












Click it and Unblock the Notifications