బోరుగడ్డ అనిల్‌కు రాచమర్యాదలు: నలుగురు పోలీసులపై వేటు
గుంటూరు: రిమాండ్ ఖైదీగా ఉన్న రౌడీ షీటర్ బోరు గడ్డ అనిల్ కుమార్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. బోరుగడ్డ అనిల్‌కు రాచమర్యాదలు చేసిన వ్యవహారంపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు.
హెడ్ కానిస్టేబుళ్లు సర్దార్, గౌస్, శ్రీనివాసరావు, కానిస్టేబుల్ పరమేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల బోరుగడ్డ అనిల్‌ను రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తూ.. రెస్టారెంట్‌లో బిర్యానీ పెట్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.

జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అనిల్‌ను ఓ కేసులో గత నెల 26 నుంచి 29 వరకు అరండల్‌పేట పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. విచారణ ముగిశాక లాకప్‌లో ఉంచకుండా.. స్టేషన్‌లోనే బల్లమీద దిండు, దుప్పట్లతో పడక ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా అయ్యింది. పోలీసుల ముందే అనిల్ దర్జాగా కుర్చీలో కూర్చోవడం, గట్టిగా మాట్లాడటం వంటివి ఆ వీడియోలో కనిపించాయి.
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కు గుంటూరు పీఎస్‌లో రాచమర్యాదలు.
— Annapureddy Achyuthreddy (@TdpReddyy) November 9, 2024
ఇటీవల బోరుగడ్డ అనిల్ కు బిర్యానీతో పోలీసులు విందు.... జైలు నుంచి తీసుకెళ్తూ రెస్టారెంట్ లో బోరుగడ్డతో భోజనం.
తాజాగా పోలీస్ స్టేషన్ లోనే బోరుగడ్డకు బెడ్డు...పరుపు మరియు దుప్పట్లు అందించిన పోలీసులు.... @YSRCParty @JaiTDP pic.twitter.com/7uKhFjZi5a
రౌడీషీటర్‌కు రాచమర్యాదలు అంటూ విమర్శలు రావడంతో గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ కౌంకా శ్రీనివాసరావును వీఆర్‌కు పంపించారు. కాగా, మూడు రోజుల క్రితం అనిల్ మేనల్లుడికి ములాఖత్ అవకాశం కల్పించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది. వరుసగా జరిగిన ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్ వేర్వేరుగా ఈ వ్యవహారాలపై నివేదికలు తెప్పించుకున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం ఉందని విచారణలో తేలడంతో బాధ్యులైన పోలీసులపై తాజాగా చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications