ఏపీలో కరోనా విలయం: గుంటూరు గజగజ.. గ్రామ వాలంటీర్‌కు వైరస్.. మళ్లీ పెరిగిన కేసులు
వ్యవసాయ ఆధారిత ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ కు మినహాయింపులు కోరుతూ ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖరాసిన వేళ.. రాష్ట్రంలో కొవిడ్-19 కేసులు సంఖ్య మళ్లీ పెరిగింది. సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 19 కొత్త కేసులు వెలుగులోకిరాగా, అందులో 11 మంది గుంటూరు జిల్లాకు చెందినవాళ్లే కావడం కలకలం రేపుతున్నది. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఇప్పటిదాకా రాష్ట్రంలో మొత్తం కేసులు 439కి పెరిగాయి. అందులో 12 మంది డిశ్చార్జ్ కాగా, ఏడుగురు చనిపోయారు. అనంతపురం జిల్లాలో 2, కృష్ణా 2, గుంటూరు 2, కర్నూలు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

గుంటూరులో ఏం జరుగుతోంది?
మర్కజ్ ఘనట తర్వాత కర్నూలులో కొవిడ్-19 కేసులు సంఖ్య పెరగగా, అక్కడ కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసి, వైరస్ వ్యాప్తి నిరోధానికి చర్యలు చేపట్టారు. కర్నూలు కంటే వేగంగా ఇప్పుడు గుంటూరులో కొత్త కేసులు వస్తుండటం గుబులురేపుతున్నది. సోమవారం బయటపడ్డ 19 కొత్త కేసుల్లో 11 గుంటూరు జిల్లాలోనే చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 93కు పెరిగింది. ఇదే జిల్లాలో ఓ గ్రామ/వార్డు వాలంటీర్ వైరస్ బారినపడ్డాడని, అయితే అసింప్టమాటిక్(లక్షణాలు బయటపడకుండా రోగానికి గురికావడం) కావడంతో అతణ్ని ఆలస్యంగా గుర్తించారని, దీంతో వాలంటీర్ కుటుంబంతోపాటు ఇరుగుపొరుగువాళ్లను కూడా క్వారంటైన్ కు తరలించినట్లు తెలిసింది.

క్వారంటైన్ సెంటర్ పై దాడి..
అనంతపురం జిల్లా గుత్తిలో కరోనా అనుమానితులుగా భావిస్తోన్న కొందరిని అధికారులు స్థానిక ఎస్‌కేడీ కాలేజీలోని క్వారంటైన్ సెంటర్ లో ఉంచారు. వాళ్లలో మహారాష్ట్ర వలస కూలీలు కూడా ఉన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లాగే ఏపీలో చిక్కుకుపోయిన ఈ వలస కూలీలు కూడా సొంత ప్రాంతాలకు వెళ్లిపోతామంటూ ఆందోళనకు దిగారు. తమకు వైరస్ లక్షణాలు లేవని, అయినాకూడా రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచడమేంటని అధికారుల్ని నిలదీశారు. ఈక్రమంలో ఆవేశానికి లోనైన వలసదారులు.. క్వారంటైన్ సెంటర్ పై రాళ్లదాడికి దిగారు. పోలీసుల జోక్యంతో వివాదం తాత్కాలికంగా సర్దుమణిగింది.
Recommended Video

జిల్లాల వారీగా ఇలా..
సోమవారం రాత్రి నాటికి రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 439గా ఉంది. అందులో ఒక్క గుంటూరు జిల్లాలోనే 93 కేసులు నమోదు కావడం గమనార్హం. కర్నూలులో 85, నెల్లూరు 56, ప్రకాశం 41, కృష్ణా 36, కడప 31, చిత్తూరు 23, వెస్ట్ గోదావరి 23, విశాఖపట్నం 20, ఈస్ట్ గోదావరి 17, అనంతపురం జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కేసు కూడా రాలేదు.












Click it and Unblock the Notifications