కార్లో రాలేకపోతున్నా-అడిగితే బ్లాక్ మెయిల్-సీపీఐ నారాయణ కామెంట్స్
ఏపీలో వైసీపీ సర్కార్ పై, సీఎం జగన్ పై అదను దొరికినప్పుడల్లా విమర్శలు చేసే సీపీఐ జాతీయ నేత నారాయణ ఇవాళ ఓ ఆసక్తికరమైన కథ చెప్పారు. అది ఆయన తెలంగాణ నుంచి ఏపీకి కార్లో వచ్చిన కథ. తద్వారా తెలంగాణకూ, ఏపీకి మధ్య ఆయన పోలిక పెట్టారు. అంతే కాదు అడిగితే బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ వైసీపీ సర్కార్ పై నారాయణ విమర్శలు కూడా చేశారు. దీంతో ఇప్పుడు నారాయణ ట్రావెల్ స్టోరీ చర్చనీయాంశమైంది.
ఏపీలో రోడ్ల దుస్ధితిపై గతంలో ఎప్పటినుంచో సీపీఐ నారాయణ జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో ఆయన తాజాగా తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించారు. తెలంగాణలోని కొత్తగూడెం నుంచి ఏపీకి వస్తుంటే తనకు మధ్యలో ఎదురైన అనుభవాన్ని నారాయణ బయటపెట్టారు. ఇదే క్రమంలో వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదంతా ఎందుకంటే ఏపీలో రోడ్లు బాగోలేవనేది నారాయణ ఆవేదన.

తాజాగా కొత్తగూడెం నుంచి ఏపీకి వస్తుంటే కార్లో పేపర్ చదివగలిగానని నారాయణ తెలిపారు. కానీ ఏపీలోకి ఎంట్రీ ఇచ్చాక మాత్రం పేపర్ చదవలేని విధంగా కారు తీవ్రంగా కుదుపులకు గురైందన్నారు. తమిళనాడు నుంచి ఏపీకి వస్తే కూడా ఇలాగే ఉంటోందని నారాయణ వెల్లడించారు. తమిళనాడులో, తెలంగాణలో రోడ్లు బాగున్నాయని, కానీ ఏపీ బార్డర్ లోకి వస్తూనే ఒకటే కుదుపులు అని నారాయణ ఆక్షేపించారు. ఆ రెండు రాష్ట్రాల్లో రోడ్లు బాగుండి, ఏపీలోనే ఎందుకు ఈ దుస్థితి అని ఆయన ప్రశ్నించారు.
ఏపీలో రోడ్ల దుస్ధితికి కారణం ఎవరని సీపీఐ నారాయణ ప్రశ్నించారు. అంతే కాదు ఏపీలో సమస్యలపై ప్రశ్నిస్తే తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. ఇప్పటికైనా బ్లాక్ మెయిల్స్ మాని పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూసుకోండని నారాయణ హితవు పలికారు.












Click it and Unblock the Notifications