ఏపీ ఫలితాలు తారుమారే- సీఎం డిసైడర్ మోడీ-సీపీఐ నారాయణ షాకింగ్..!
ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా సంచలనాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా భారీ పోలింగ్ శాతం నమోదుతో పాటు హింసాత్మక ఘటనలు కూడా జరిగాయి. ఆ తర్వాత ఈవీఎంల ధ్వంసం ఘటనలు బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా ఏపీ ఎన్నికలు చర్చనీయాంశమయ్యాయి. అలాగే ఫలితాలపైనా ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ నేత నారాయణ ఏపీ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈసారి ఏపీ ఎన్నికల్లో అక్రమాలకు బాధ్యులుగా ఈసీ ఉన్నతాధికారులను మార్చింది కానీ కింది స్ధాయిలో మొత్తం వైసీపీ సామ్రాజ్యమే ఉందని సీపీఐ నారాయణ వెల్లడించారు. అలాగే ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నా సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు విదేశాలకు వెళ్లిపోవడాన్ని నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. వీరి ప్రవర్తన బాధ్యతా రాహిత్యంగా ఉందని ఆరోపించారు.

రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలపైనా నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే ఈసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది కూడా ప్రధాని మోడీయే నిర్ణయిస్తారని నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. తద్వారా జగన్ అయినా, చంద్రబాబు అయినా ప్రధాని మోడీ దయతోనే సీఎం కావాల్సి ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు.
ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల ఎన్నికల పోలింగ్ లో అక్రమాలు జరిగాయని, వాటిపై రీపోలింగ్ కావాలంటూ వైసీపీ నేతలు కోర్టుకెళ్లారు. అలాగే అక్రమాలకు బాధ్యులుగా ఈసీ అధికారులను ఇప్పటికీ సస్పెన్షన్లు చేస్తూనే ఉంది. దీంతో ఫలితాలపైనా రాజకీయ పార్టీలతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఉత్కంఠ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో నారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంచరించుకున్నాయి.












Click it and Unblock the Notifications