వైసీపీ ఓటమికి కరెక్ట్ రీజన్ చెప్పిన నారాయణ..! జగన్ విపక్ష హోదాపై చురకలు..!
ఏపీలో తాజా ఎన్నికల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన వైసీపీ దారుణంగా పరాజయం పాలైంది. అదే సమయంలో గత ఎన్నికల్లో వైసీపీ సాధించిన 151 సీట్ల రికార్డును తుడిచిపెడుతూ కూటమి పార్టీలు ఏకంగా 164 సీట్లతో కొత్త రికార్డు సృష్టించాయి. ఈ సునామీలో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైపోయింది. జగన్ పార్టీ ఇంత దారుణంగా ఓటమి పాలవ్వడంపై ఇప్పటికే పలు విశ్లేషణలు వచ్చేశాయి. అయితే సీపీఐ నారాయణ మాత్రం తనదైన శైలిలో తాజాగా చేసిన ఓ విశ్లేషణ చర్చనీయాశమవుతోంది.
రాష్ట్రంలో వైసీపీ దారుణ ఓటమి వెనుక రాజకీయంగా ఉన్న కారణాన్ని సీపీఐ నారాయణ బయటపెట్టారు. ముఖ్యంగా రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి అవసరమని నారాయణ పేర్కొన్నారు. దీన్ని జగన్ తెలుసుకోలేకపోయారన్నారు. గత ఐదేళ్లలో జగన్ తటస్ధ వైఖరి అనుసరించడం వల్లే ఎన్నికల్లో వైసీపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ముఖ్యంగా బీజేపీ విషయంలో జగన్ తటస్ధ వైఖరి ఆయన కొంప ముంచిందని నారాయణ విశ్లేషించారు.

ఉంటే బీజేపీతో ఉన్నామని.. లేకపోతే లేమని జగన్ గట్టిగా చెప్పలేకపోవడం వల్లే రాజకీయంగా నష్టపోయారన్నారని నారాయణ తెలిపారు. జగన్ కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తే సరిపోదని, రాష్ట్రంలో అభివృద్ధి కూడా కావాలని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోవడం వల్లనే వైసీపీకి 11 స్థానాలు వచ్చాయన్నారు. మరోవైపు ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత హోదా కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాలను నారాయణ తప్పుబట్టారు. సభ్యుల సంఖ్యను బట్టి ప్రతిపక్ష హోదా ఉంటుంది తప్ప ఓట్ల శాతం బట్టి కాదన్నారు.












Click it and Unblock the Notifications