
ప్లీనరీలో వైసీపీ, మినీ మహానాడులో టీడీపీ తీర్మానాలు ఎందుకు చేయలేదు?
ఎన్ని నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటు పరం చేయడానికే కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకోవడంవల్ల ప్రయివేటీకరణ ఖాయమనే విషయం స్పష్టమైందని, 24వేల టన్నుల ఉత్పత్తికిగాను 15వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం వేసిన మరో ఎత్తుగడగా దీన్ని ఆయన అభివర్ణించారు.
భారతీయ జనతాపార్టీ సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాసి విశాఖ ఉక్కును ప్రయివేటుపరం చేయడానికి చూస్తోందంటూ మండిపడ్డారు. అంతర్జాతీయంగా బొగ్గు ధర పడిపోయిందన్నారు. వైసీపీ ప్లీనరీలోకానీ, టీడీపీ మినీ మహానాడులోకానీ విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

Recommended Video

విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ఇక్కడ స్థాపించేందుకు ఉమ్మడి రాష్ట్రంలోని ప్రజలంతా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సంస్థను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారని, అది కాస్తా విశాఖ ఉక్కు, ప్రయివేటు కంపెనీల హక్కుగా కేంద్రం మార్చేసిందన్నారు. లాభాల బాటలో ఉన్న సంస్థను అస్మదీయులకు కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని రాఘవులు ధ్వజమెత్తారు. దేశంలో ఇప్పటికే ఎన్నో విలువైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తున్నారని, నిరసనలు తీవ్రంగా రావడంతో ఇప్పుడు ఉత్పత్తి తగ్గించి గిట్టబాటు కావడంలేదనే సాకుతో ప్రయివేటు పరం చేయబోతున్నారని, అంతేకాకుండా ఇక్కడ సంస్థకున్న భూముల విలువే వేలకోట్ల రూపాయల విలువ చేస్తాయని, వాటిపై ప్రయివేటు కంపెనీల కన్ను పడిందని చెప్పారు.