దుబాయ్, సింగపూర్, దోహా.. ఇప్పుడిక ఏపీ రాజధాని అమరావతిలో.. !!
ఏపీ రాజధాని అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యావరణ హిత నగరంగా నిర్మించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని భవన సముదాయాల కోసం అత్యాధునిక డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రక్రియను ఆరంభించింది. ఇందులో భాగంగా ఏపీ సీఆర్డీఏ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ పద్ధతిలో ఈ భారీ ప్రాజెక్ట్ ను ప్రభుత్వం చేపట్టనుంది. దీని అంచనా వ్యయం 415 కోట్ల రూపాయలు.
రాజధాని నిర్మాణ ప్రాజెక్టులను వేగవంతం చేసే క్రమంలో ఈ టెండర్ ప్రక్రియ మొదలు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 30,000 టన్నుల మేర కూలింగ్, రిఫ్రిజిరేషన్ సామర్థ్యంతో ఇది నిర్మితం కానుంది. బిల్ట్- డెవలప్- ట్రాన్స్ ఫర్ ప్రాతిపదికన దీన్ని చేపట్టాలని సీఆర్డీఏ ప్రాథమికంగా నిర్ణయించింది. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థకు లీజు రూపంలో దీని నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని బదలాయిస్తుంది ఇస్తుంది.

అలాగే.. ఏడాదిన్నర కాలంలో నిర్మాణం పూర్తి చేయడం, 30 సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతలను చూసుకునేలా టెండర్ క్లాజుల్లో పొందుపరిచారు. బిడ్స్ దాఖలు చేయడానికి సెప్టెంబరు 17 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలలో ప్రతి గదికి లేదా విభాగానికి విడివిడిగా ఏసీలను అమర్చుకుంటుంటారు. దీని వల్ల విద్యుత్ ఖర్చు పెరగడం హానికారక గ్రీన్ హౌస్ వాయువులు విడుదల అవుతుంటాయి.
ఈ డిస్ట్రిక్ట్ కూలింగ్ విధానంలో ఒకే చోట సెంట్రలైజ్డ్ రిఫ్రిజిరేషన్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తారు. ఇక్కడి నుంచే ఏసీని ప్రత్యేక పైప్‌లైన్ నెట్వర్క్ ద్వారా గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని అన్ని ప్రభుత్వ భవనాలకు సరఫరా చేస్తారు. ఈ వ్యవస్థ వల్ల భారీ భవన సముదాయాల నిర్వహణ ఎంతో సులభతరమౌతుంది. వేర్వేరు ఏసీలు వాడటం కంటే ఈ సెంట్రలైజ్డ్ విధానం వల్ల దాదాపు 30 నుంచి 40 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తోన్నారు.
పర్యావరణానికి నష్టం కలిగించే గ్రీన్హౌస్ వాయువుల తీవ్రతను ఇది సమర్థవంతంగా తగ్గిస్తుంది. ప్రస్తుతం సింగపూర్, దుబాయ్, దోహా, లండన్ వంటి అంతర్జాతీయ మెట్రోపాలిటన్ సిటీల్లో మాత్రమే ఇటువంటి అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. ఇప్పుడు అదే తరహాలో అమరావతిలోని సచివాలయం, శాసనసభ, హైకోర్టు వంటి ప్రభుత్వ కార్యాలయాలకు ఈ విధానాన్ని అమలు చేయాలనేది ప్రభుత్వం ఉద్దేశం.
రాజధాని అమరావతిని ఓ పరిపాలనా నగరంగానే కాకుండా, అత్యాధునిక మౌలిక వసతులతో కూడిన డెస్టినేషన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రిఫ్రిజిరేషన్ ప్లాంట్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.














Click it and Unblock the Notifications