అమరావతి నిర్మాణం వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
రాజధాని అమరావతి పై ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రపంచ బ్యాంకుతో రుణం కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వం..ముందుగా అక్కడ సమస్యల పరిష్కారం పైన ఫోకస్ చేసింది. వచ్చే నెలాఖరు నుంచి పనులు ప్రారంభించేలా కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో కృష్ణానది వరదలు వచ్చినా అమరావతికి ముంపు లేకుండా కీలక ప్రతిపాదనలు సిద్దమవుతున్నాయి.
ప్రతిపాదనలు
రాజధాని అమరావతికి ముంపు లేకుండా సీఆర్డీఏ తాజా ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం ఉన్న కరకట్టను విస్తరించేందుకు కొత్త ప్రణాళికతో సిద్దం అవుతోంది. ఇందు కోసం సుమారు రూ.650 కోట్లు ఖర్చవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుండి వైకుంఠపురం వరకూ దీన్ని కరకట్టను బలోపేతం చేయడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో కట్టను లోపలకు మళ్లించాలనీ ప్రతిపాదించారు. దీనిపై టెండర్లు పిలవనున్నారు. ప్రస్తుతం కృష్ణానదికి 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది.

కరకట్ట విస్తరణ
వాతావరణ మార్పుల్లో భాగంగా 15 లక్షల క్యూసెక్కులు వచ్చినా అమరావతి నగరానికి ఇబ్బంది లేకుండా దీన్ని రూపొందించనున్నారు. దీంతో పాటు కృష్ణా నది తీరాన పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. గతంలో ఇక్కడ రైతులు భూసమీకరణ కు భూములు ఇవ్వకపోవడంతో పాటు కోర్టును ఆశ్రయించడంతో పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం మంత్రి నారాయణ పెనుమాక పరిధిలో పర్యటించి గతంలో పూలింగుకు ఇవ్వని భూముల రైతులను కలుస్తున్నారు. పూలింగుకు ఇస్తే ఇంటికొచ్చి భూములు తీసుకుంటామని ప్రకటించారు. బ్యారేజీ నుండి వారధి మీదుగా వెళ్లేందుకు రెండులైన్ల రోడ్డుకు ప్లాను చేస్తున్నారు.
నాలుగు లైన్ల రోడ్డుగా
సీడ్ యాక్సెస్ రోడ్డు పరిధిలోకి వచ్చే భూములకు సంబంధించి ఎటువంటి సమస్యా లేకపోవడంతో వెంకటపాలెం నుండి దీన్ని సీతానగరం వరకూ కొనసాగింపు పనులు చేపట్టనున్నారు. దీనిలో భాగంగానే వెంకటపాలెం నుండి హరిశ్చంద్రాపురం, వైకుంఠపురం వరకూ కరకట్టను బలోపేతం చేయనున్నారు. సెక్రటేరియట్, హైకోర్టుకు వెళ్లాలంటే కరకట్ట మార్గమే దగ్గరగా ఉంది. ప్రకాశం బ్యారేజీ నుండి వెంకటపాలెంలోని ప్రకృతి ఆశ్రమం వరకూ కరకట్టను నాలుగులైన్లుగా విస్తరించడం ద్వారా ట్రాఫిక్ సమస్యను కొంత వరకూ పరిష్కరించొచ్చని, కరకట్ట విస్తరణ ద్వారా భూసేకరణ సమస్య కూడా ఉండదని సిఆర్‌డిఏ అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications