కోట వినుతకు మరో షాక్..! తేల్చేసిన ఏపీ హోంమంత్రి..!
ఏపీలో శ్రీకాళహస్తికి చెందిన జనసేన నాయకురాలు కోట వినుత డ్రైవర్ హత్య కేసులో వరుస ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తన దగ్గర పనిచేసిన డ్రైవర్ తో వినుత సన్నిహితంగా మెలిగిన ఫొటోలు ఇప్పటికే బయటికొచ్చాయి. అలాగే టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో వినుత బెడ్ రూమ్ లో కెమెరా పెట్టి డ్రైవర్ వీడియోలు రికార్డ్ చేయడం, ఆ కోపంతో అతనిపై వినుత దంపతులు దాడి చేసినట్లు ప్రస్తుతానికి తేలింది. అయితే హత్య ఎవరు చేసారన్న దానిపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబుపైనా వేటు వేసింది.
అధికార కూటమిలోని జనసేన పార్టీకి చెందిన మహిళా నేత కోట వినుత ఇలా డ్రైవర్ హత్య కేసులో ఆరోపణలతో అరెస్టు అయిన వ్యవహారంపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. నేరస్తుల విషయంలో కూటమి ప్రభుత్వ వైఖరిని ఆమె తేల్చిచెప్పేశారు. నేరస్తులకు కులం, మతం, పార్టీ ఉండదన్నారు. తాము ఈ కేసులో నిందితుల్ని వెనకేసుకురావడం లేదని అనిత గుర్తుచేశారు. దీంతో కోట వినుత వ్యవహారంలో ప్రభుత్వం తొలిసారి అధికారికంగా స్పందించినట్లయింది.

మరోవైపు వైసీపీ తాజాగా రప్పా రప్పా కామెంట్స్ చేసిన వారిని వెనకేసుకు వచ్చిందని, తాము మాత్రం అలా చేయడం లేదని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పుకొచ్చారు. నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడాలనే కోరుకుంటున్నట్లు తెలిపారు. దీంతో కోట వినుత వ్యవహారంలో ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉందని అర్థమవుతోంది. ఇప్పటికే డ్రైవర్ హత్య కేసులో కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు అరెస్టు కాగానే వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జనసేన నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ కూడా ఈ విషయంలో నోరు మెదపలేదు. అదే సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేరు కూడా రావడంతో ఈ మౌనం వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications