పంటల బీమాపై రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు!
ఈసారి తెలుగు రాష్ట్రాలపై వరుణుడు కనికరించలేదు. ఫలితంగా ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు సాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవటం కారణంగా ఏపీలో రైతులు సాగుకు వెనకడుగు వేస్తున్నారు.ఇక పంటలు వేసుకున్న రైతులు వర్షాలు లేక భవిష్యత్ పరిస్థితి అర్ధం కాక ఇబ్బంది పడుతున్నారు.
రైతులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు
ఈ క్రమంలో ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుతం చోటు చేసుకున్న వర్షాభావం, అనిశ్చిత వర్షపాతం ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు పంటల బీమా విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పంటల బీమా నమోదుకు ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉందని, చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అసెంబ్లీలో సూచించారు.

రైతుకు ఆర్థిక భరోసా కల్పించడంలో పంటల బీమా కీలక పాత్ర
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఎప్పుడు మారతాయో చెప్పలేని స్థితి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాలు వంటి కారణాలతో పంట నష్టపోయినప్పుడు రైతుకు ఆర్థిక భరోసా కల్పించడంలో పంటల బీమా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అందుకే ప్రతి రైతు బీమా రక్షణ పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటా చాలా తక్కువగా ఉంటుందని అచ్చెన్నాయుడు వివరించారు. ప్రాంతం, పంటను బట్టి రైతు వాటా మారుతుందని చెప్పారు.
స్వల్ప మొత్తం చెల్లించి పంట నష్టం జరిగినప్పుడు రక్షణ పొందే అవకాశం
మిగిలిన ప్రీమియం భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. స్వల్ప మొత్తం చెల్లించి పంట నష్టం జరిగినప్పుడు రక్షణ పొందే అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. పంటల బీమా నమోదును కేవలం వ్యవసాయ శాఖ కార్యక్రమంగా చూడకూడదని, ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని మంత్రి స్పష్టం చేశారు.
నెలాఖరే గడువు కావడంతో మంత్రి అలెర్ట్
ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్హులైన రైతులందరూ నమోదు చేసుకునేలా చూడాలని సూచించారు. ఈ నెలాఖరే గడువు కావడంతో చివరి రోజు వరకు వేచి చూడకుండా వెంటనే నమోదు చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి రైతులకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications