జనసేన నేత కు సీఎస్ జవహర్ రెడ్డి హెచ్చరిక..!!
ఏపీలో ఎన్నికల ఫలితాల పై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రమాణ స్వీకారం పైన ముహూర్తాలు ఖరారవుతున్నాయి. ఈ సమయంలోనే అనూహ్యంగా జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పైన తీవ్ర ఆరోపణలు చేసారు. భూమలు కొట్టేశారంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వీటి పైన సీఎస్ జవహర్ రెడ్డి సీరియస్ అయ్యారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు.
మూర్తి యాదవ్ ఆరోపణలు
సీఎస్ జవహర్ రెడ్డి పైన జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ భూ ఆరోపణలు చేసారు. సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తరాంధ్రలో రెండు వేల కోట్ల అస్సైన్డ్ భూములు కొట్టేశారన్నారు. జవహర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీవో 596 తెచ్చారన్నారు. ఆ జీవో ఆధారంగా కుమారుడిని విశాఖలో పెట్టి 800 ఎకరాలకు పైగా భూముల మార్పిడి జరిగిందని ఆరోపించారు.

భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు పరిశీలన పేరు చెప్పి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారన్నారు. జగనన్న పేదల ప్రభుత్వంలో సీఎస్ కు విశాఖలో రెండు వేల కోట్ల భూములు కొట్టేశారని, మిగిలిన చోట్ల ఇంకెంతో అంటూ ప్రశ్నించారు.
భూములు కొట్టేశారంటూ
వేల కోట్ల భూకుంభకోణానికి నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న సీఎస్ జవహర్ రెడ్డి తెరలేపారన్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రా జిల్లాల్లో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువైన, ఎస్సీ, బీసీలకు చెందిన 400 ఎకరాల అసైన్డ్ భూములను కుమారుడిని అడ్డంపెట్టి బినామీల పేరిట చేజిక్కించుకున్నారని ఆరోపించారు.
మరో 400 ఎకరాలకు పైగా భూములను ఆఘమేఘాల మీద రిజిస్ర్టేషన్ చేయించేందుకు యుద్ధ ప్రాతి పదికన యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. జవహార్ రెడ్డి అసైన్డ్ భూములు ఎక్కువగా ఉన్న విశాఖ, విజయనగరం జిల్లాలపై కన్ను వేసి కుమారుడిని రంగంలోకి దింపారని తీవ్ర ఆరోపణలు చేసారు.

సీఎస్ స్పందన
తనపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన భూముల కొనుగోలు ఆరోపణలను సీఎస్ జవహర్ రెడ్డి ఖండించారు. విశాఖలో తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ భూములు లేవని తెలిపారు. విశాఖ పర్యటనలో తన మిత్రుడి ఇంటికి వెళ్లాలన్నారు. అలాగే భోగాపురం ఎయిర్ పోర్టు పనులపై సమీక్షించానన్నారు.
గత కొంత కాలంగా కొందరు తనపై దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. జనసేన కార్పొరేటర్ చేసిన ఆరోపణలు వాస్తవం కాదని, మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలని సీఎస్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అతనిపై పరువు నష్టం దావా వేస్తానని, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications