వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొత్స ఇలాకా యుద్ధభూమి, కర్ఫ్యూ: మహిళలపై లాఠీచార్జ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయనగరం/హైదరాబాద్: విజయనగరంలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గలేదు. ఆదివారం ఉదయం విజయనగరం కోట కూడలిలోని మార్కెట్ వద్ద మహిళల పైన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కర్ఫ్యూ ఉన్నందున ప్రజలు బయటకు రావొద్దని పోలీసు అధికారి విక్రమ్ సింగ్ సూచించారు. రహదారుల పైకి ప్రజలు వస్తే రబ్బర్ బుల్లెట్లు ప్రయోగిస్తామని హెచ్చరించారు.

గూండాలూ, రౌడీలే ఈ దాడులకు కారణమని ఆయన చెబుతున్నారు. కొందరిని తాము అదుపులోకి తీసుకున్నామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామన్నారు. ఎవరు కర్ఫ్యూను ఉల్లంఘించవద్దన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 Curfew in Vijayanagaram

కాగా, శనివారం నుండి విజయనగరం అట్టుడుకుతోంది. దాడులు, దహనాలు, ఆస్తుల విధ్వంసాలు, రాళ్ల దాడులు, పోలీసుల లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగంతో ఉద్రిక్త నగరంగా మారింది. సమైక్య ఉద్యమం హింసాత్మక మలుపు తీసుకుని.. విజయనగరం చరిత్రలో తొలిసారిగా కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు 'పెట్టని కోట' ఇప్పుడు బొత్స వ్యతిరేక ఆందోళనలతో రగిలిపోతోంది.

రాష్ట్ర విభజనకు బొత్స లోపాయికారీ సహకారం అందించారనే అనుమానంతో ఉద్యమకారులు శుక్రవారం నుంచే ఆయన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలుపెట్టారు. తాజాగా ఇతర కాంగ్రెస్ నేతలు, బొత్స వర్గీయులు, ప్రభుత్వ ఆస్తులూ ధ్వంసమయ్యాయి. శనివారం ఉదయం నుంచీ పోలీసులు, సమైక్యవాదుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పలుమార్లు లాఠీ చార్జిలు, బాష్పవాయుగోళాలు, రబ్బరు బుల్లెట్లతో పోలీసులు విరుచుకుపడ్డారు. ప్రతిగా ఉద్యమకారులు రాళ్లదాడి చేశారు.

ఉదయం 8 గంటల సమయంలో పదివేల మంది ఆందోళనకారులు ఆరేడు బృందాలుగా విడిపోయారు. పలుచోట్ల విధ్వంసం సృష్టించారు. బొత్స ఇంటికి చేరుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు ఆరంభం నుంచీ రాళ్లు, గాజుసీసాలతో పోలీసులపై దాడి చేశారు. కొద్దిసేపు సంయమనం పాటించిన పోలీసులు తర్వాత లాఠీలకు పని చెప్పారు. అయినా, ఆందోళనకారులు లెక్క చేయకుండా ముందుకు దూసుకురావడంతో పలుమార్లు బాష్పవాయువు ప్రయోగించారు. అప్పటికీ ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. రాళ్ల దాడిని తీవ్రం చేస్తూ పోలీసులను పరుగులు తీయించారు. పోలీసులు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించినా, ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు.

మధ్యాహ్నం రెండు గంటలకు పరిస్థితి మళ్లీ భగ్గుమంది. కొత్తపేటలో ఉన్న బొత్స సోదరుడు, సత్య విజన్ ఎండి శ్రీనివాస రావు ఇంటిపై మహిళలు దాడి చేశారు. అద్దాలను పగులగొట్టారు. ఆయన కారును ధ్వంసం చేశారు. శుక్రవారం తగులబెట్టిన సత్య విజన్ స్టూడియోలో కాలిపోగా మిగిలిన కొద్దిపాటి సామగ్రిని శనివారం బయటుకు విసిరేసి నిప్పంటించారు. స్టూడియో వ్యాన్‌ను కూడా తగలబెట్టారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి విధ్వంసం మరింత రాజుకుంది. ఆందోళనకారులు పట్టణమంతా తిరుగుతూ బీభత్సం సృష్టించారు.

కోట జంక్షన్ వద్ద పోలీస్ ఔట్‌పోస్టును తగలబెట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ, డిసిసి అధ్యక్షుడు కోలగట్ల వీరభద్ర స్వామి ఇంటిని ముట్టడించారు. బయటి నుంచి రాళ్లతో దాడి చేశారు. కోలగట్ల ఇంట్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాల మధ్య రాళ్ల వర్షంతో బీతావహ పరిస్థితి ఏర్పడింది.

కోలగట్ల నివాసానికి సమీపంలోనే ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌కు చెందిన అవంతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన రెండు బస్సులను ఆందోళనకారులు తగలబెట్టారు. ఆ తర్వాత జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి)కి నిప్పంటించారు. తొలుత ఫర్నీచర్‌ను బయటికి తెచ్చి నిప్పంటించి తర్వాత బ్యాంకు తలుపులకే నిప్పు పెట్టారు.

దీంతో పోలీసుల రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయువు ప్రయోగించారు. భాష్పవాయువు ప్రభావం ఐదారువందల మీటర్ల వరకూ వ్యాపించడంతో ఉద్యమకారులు కకావికలమయ్యారు. రాత్రి 9 గంటలకు కూడా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. బొత్స ఇంటిని ఏ క్షణాన్నైనా ముట్టడించి తగులబెడతామని కేకలు వేస్తూ వీధుల్లో తిరిగారు. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ విధించారు.

English summary
Curfew was imposed in Vijayanagaram on Saturday after two days of unrelenting violennce and attacks on government properties and those belonging to PCC president Botsa Satyanarayana, accompanied by looting of shops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X