టెన్షన్ పుట్టించే వార్త: వాయిస్ క్లోనింగ్ తో సైబర్ క్రైమ్స్; బ్యాంకుల అలెర్ట్!!
టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో అంతే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యగా సైబర్ నేరాలు మారాయి. శాంతి భద్రతల పరిరక్షణ కంటే ఇప్పుడు పోలీసులకు సైబర్ నేరాలను కట్టడి చేయడమే కీలకంగా మారింది. సైబర్ నేరగాళ్లు రోజుకు ఒక కొత్త పంధాలో దోపిడీకి పాల్పడుతున్నారు.
సైబర్ నేరాలలో వినూత్న ప్రయోగం
ఇప్పటివరకు వివిధ బ్యాంకుల పేరుతో వస్తున్న మెసేజ్ లకు, కస్టమర్ కేర్ కాల్స్ కు స్పందించవద్దని ఎట్టి పరిస్థితులలోను ఓటిపిలను షేర్ చేయవద్దని బ్యాంకర్లు పదే పదే తమ కస్టమర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు . ఇక ఇదే సమయంలో మనందరికీ టెన్షన్ పుట్టించే ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు దోపిడీలలో మరో వినూత్న ప్రయోగాన్ని చేస్తున్నారు.

కస్టమర్ లను అలెర్ట్ చేస్తున్న బ్యాంకులు
కొత్త మార్గాలలో డబ్బులు కొల్లగొట్టేందుకు అడ్వాన్స్ డ్ టెక్నాలజీని వాడుతున్నారు. తాజాగా వాయిస్ క్లోనింగ్ తో తమ కుటుంబ సభ్యుల మాదిరిగా ఫోన్ కాల్స్ చేసి అమాయకుల ఖాతాలోని డబ్బు కాజేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని గుర్తించిన బ్యాంకర్లు కస్టమర్లను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
వాయిస్ క్లోనింగ్ తో ఫోన్ కాల్స్
మీ కుటుంబ సభ్యుల పేరుతో వాయిస్ క్లోనింగ్ చేసి ఎవరైనా ఫోన్ కాల్ చేసి డబ్బులు కావాలని అడిగితే మళ్లీ ఒకసారి మీ కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ చేసి కన్ఫామ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. తమ వారేనని నమ్మి వారు చెప్పిన అకౌంట్ కు డబ్బులు వేస్తే నష్టపోతారని హెచ్చరిస్తున్నారు.
మీరు చెయ్యాల్సింది ఇదే
వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ తో దగ్గర బంధువుల మాదిరిగా ఫోన్ చేసి ఫోన్లో మాటలు కలిపి డబ్బు పంపాలని కోరుతున్నారని కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. ఎవరైనా మీ బంధువుల పేరుతో ఫోన్ చేసి వారి గొంతులో వాయిస్ క్లోనింగ్ తో గొంతు మార్చి డబ్బులు కావాలని అడిగితే వెంటనే కాల్ డిస్కనెక్ట్ చేసి సదరు వ్యక్తికి ఫోన్ చేసి కనుక్కోవాలని సలహా ఇస్తున్నారు.
సైబర్ నేరాలపై వెంటనే ఫిర్యాదు చెయ్యండి
పిన్ నెంబర్లను, పాస్వర్డ్ లను, ఓటిపిలను పొరపాటున కూడా ఎవరికి షేర్ చేయకూడదని పదేపదే హెచ్చరిస్తున్నారు. గుర్తుతెలియని నెంబర్లనుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అపరిచితవ్యక్తులు మొబైల్ ఫోన్ లోకి పంపించే లింకులు కూడా క్లిక్ చేయకూడదని, అలా క్లిక్ చేస్తే మీ డబ్బులు చోరీకి గురవుతాయని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications