Arnab తుఫాన్ ఎఫెక్ట్- విశాఖ కేంద్రంగా రైళ్ల రద్దు, దారి మళ్లింపులు..!
బంగాళాఖాతంలో ఏర్పడిన అర్ణబ్ తుఫాన్ (Cyclone Arnab) రేపటి కల్లా మరింత తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉండటంతో దక్షిణ కోస్తా రైల్వే అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా విశాఖ నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తోంది. వీటి వివరాలను ఇవాళ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా విశాఖపట్నం-కిరండూల్, విశాఖపట్నం-కోరాపుట్ రైళ్లకు అంతరాయం కలగనుంది. అలాగే హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ మార్గాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
అర్ణబ్ తుఫాన్ ప్రభావం, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే ఇవాళ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను మధ్యలోనే నిలిపివేయడం, నిర్ణీత స్టేషన్‌కు బదులుగా మరో స్టేషన్ నుంచి ప్రారంభించడం వంటి మార్పులు ప్రకటించింది. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 4 వరకు వివిధ తేదీల్లో ఈ మార్పులు అమల్లో ఉంటాయి. రైల్వే ప్రకటన ప్రకారం, విశాఖపట్నం-కిరండూల్, విశాఖపట్నం-కోరాపుట్ మార్గాల్లో నడిచే పలు రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడనుంది.

రైలు నంబర్ 18515 విశాఖపట్నం-కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 4 వరకు రద్దు చేశారు. రైలు నంబర్ 18516-కిరండూల్-విశాఖపట్నం నైట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 4 వరకు రద్దు చేశారు. రైలు నంబర్ 58538 - విశాఖపట్నం-కోరాపుట్ ప్యాసింజర్ అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 30 వరకు రద్దు చేశారు. రైలు నంబర్ 58537 కోరాపుట్-విశాఖపట్నం ప్యాసింజర్ అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 31 వరకు రద్దు చేశారు. రైలు నంబర్ 18512 విశాఖపట్నం-కోరాపుట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 30న రద్దు చేశారు.

అలాగే రైలు నంబర్ 18511 కోరాపుట్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 31న రద్దు చేశారు. రైలు నంబర్ 58501 విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 30 వరకు రద్దు చేశారు. రైలు నంబర్ 58502 కిరండూల్-విశాఖపట్నం ప్యాసింజర్ అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 30 వరకు రద్దు చేశారు. అలాగే హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల్లోనూ మార్పులు చేశారు. రైలు నంబర్ 18447 భువనేశ్వర్-జగదల్పూర్ హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 30 వరకు రాయగడలోనే ప్రయాణాన్ని ముగించనుంది. కోరాపుట్ వరకు వెళ్లదు. అలాగే రైలు నంబర్ 18448 జగదల్పూర్-భువనేశ్వర్ హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 31 వరకు కోరాపుట్‌కు బదులుగా రాయగడ నుంచి బయలుదేరనుంది. కాబట్టి ప్రయాణానికి బయలుదేరే ముందు తమ రైలు నంబర్, ప్రయాణ తేదీ, రద్దు లేదా మార్పులకు సంబంధించిన తాజా సమాచారాన్ని పరిశీలించాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications
