Cyclone Arnab: వాట్సాప్ డీపీలో ఇవి పెట్టుకోండి- ప్రజలకు ఏపీ సర్కార్ పిలుపు..!
బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ (Cyclone Arnab) ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల వైపుగా దూసుకొస్తోంది. ఇవాళ రాత్రి కల్లా ఇది పెను తుఫాన్ గా మారి విధ్వంసం సృష్టించడం ఖాయమని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది. తుఫాన్ సమయంలో ప్రజలు, అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి చెందిన రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ప్రజలకు ఇవాళ ఓ కీలక సూచన చేసింది.
అర్నబ్ విపత్తు నేపథ్యంలో వాట్సాప్ లోని మన మిత్ర సేవల్ని వాడుకోవాలని ఇప్పటికే కోరుతున్న ప్రభుత్వం..ఇవాళ మరో కీలక సూచన కూడా చేసింది. వాట్సాప్ మనమిత్రలో ఇచ్చిన అత్యవసర కంట్రోల్ రూమ్ నంబర్లను ప్రజలు తమ డీపీగా పెట్టుకోవాలని కోరుతోంది. అర్నబ్ తుపాన్ తీవ్రత దృష్ట్యా అత్యవసర సహాయం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్, టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసిందని, వాటిని అందరూ ఉపయోగించుకోవాల్సిన అవసరముందిని ఆర్టీజీఎస్ తెలిపింది. కాబట్టి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నెటిజన్లు, ప్రజలు ఈ రోజు, రేపు తమ వాట్సాప్ ల్లో తమ గ్రూపులు లేదా వ్యక్తిగత డీపీ స్టేటస్‌గా ఈ నంబర్లను ఉపయోగిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని కోరుతోంది.

ఇదేమీ నిబంధన కాదని, పూర్తిగా స్వచ్ఛందమేనని కూడా చెబుతోంది. ఈ నెంబర్లను డీపీ స్టేటస్‌గా పెడితే అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని మాత్రం పేర్కొంది. 'మనమిత్ర'ను డీపీ స్టేటస్‌గా పెట్టుకుందాం... విపత్తుల వేళ సహాయం పొందుదాం అనే ఓ కొటేషన్ ను కూడా ఇచ్చింది. మరోవైపు అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలంతా సురక్షితంగా ఇళ్లకే పరిమితం కావాలని సీఎం చంద్రబాబు ఇవాళ విజ్ఞప్తి చేశారు. తీరప్రాంతాలు, ముంపు ప్రాంతాల ప్రజలు తుపాను షెల్టర్లకు తరలి వెళ్లాలని కోరారు. గాలులు, భారీ వర్షాల కారణంగా ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాలని సూచించారు. గతంలో హుద్ హుద్ సమయంలో పునరుద్ధరణకు తీవ్రంగా శ్రమించామని, రాష్ట్ర ప్రజలు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేలా నిరంతరం సమీక్ష చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.














Click it and Unblock the Notifications
