గులాబ్ తుఫాను బాధితులకు అండగా సాయమందించండి: తెలుగు తమ్ముళ్ళకు చంద్రబాబు పిలుపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గులాబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోపక్క గుంటూరు కృష్ణా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం ,విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రతీర ప్రాంతాలలో వాతావరణం అల్లకల్లోలంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో భారీ వృక్షాలు నేలకొరిగి, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం అంధకారం అలముకుంది.

తుఫాను బాధితులకు అండగా ఉండాలని... తెలుగు తమ్ముళ్ళకు చంద్రబాబు పిలుపు
ఇక ఇప్పటికే గులాబ్ తుఫాను కారణంగా ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి, సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. తాజాగా గులాబ్ తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు తమ వంతు సహాయం అందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తెలుగు తమ్ముళ్లు సహాయం అందించాలని చంద్రబాబు నాయుడు సూచించారు.

తుఫాను ప్రభావంపై అలెర్ట్ గా ఉండాలని ప్రభుత్వానికి చంద్రబాబు సూచన
బాధితులకు టీడీపీ శ్రేణులు అన్ని విధాలుగా అండగా నిలవాలని సూచించిన ఆయన సహాయక చర్యల్లో తెలుగు తమ్ముళ్ళు సైతం ముందువరుసలో ఉండాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో తుఫాను ప్రభావం పై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్న చంద్రబాబు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో తుఫాను ప్రభావం దారుణంగా ఉందన్నారు . లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారి అవసరాలను తీర్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముందస్తు చర్యలు చేపట్టి నష్టనివారణ చెయ్యాలని ఆయన పేర్కొన్నారు.

శ్రీకాకుళంలో పరిస్థితి పర్యవేక్షిస్తున్న అచ్చెన్నాయుడు
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా గులాబ్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ముంపు ప్రాంత ప్రజల పునరావాసంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడిన అచ్చెన్నాయుడు అప్రమత్తంగా ఉండాలని ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కోరారు . ఇక తెలుగుదేశం పార్టీ నేతలను సమన్వయం చేస్తూ జిల్లాలో తుఫాను పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న అచ్చెన్నాయుడు సహాయక చర్యల్లో తమ్ముళ్లు పాల్గొనాలని సూచించారు.
Recommended Video

తుఫాను వాయుగుండంగా బలహీన పడిందన్న వాతావరణ శాఖ
ఇదిలా ఉంటే కళింగపట్నం వద్ద తీరాన్ని దాటిన గులాబ్ తుఫాను తీవ్రత తగ్గి వాయుగుండంగా బలహీన పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఛత్తీస్ గడ్ జగదల్పూర్ 65 కిలోమీటర్ల తెలంగాణలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. రానున్న 24 గంటల్లో తుఫాను మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. గడిచిన ఆరు గంటలుగా ఆరు కిలోమీటర్ల వేగంతో కదులుతూ అరేబియా సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సెప్టెంబర్ 30వ తేదీ నాటికి మహారాష్ట్ర, గుజరాత్ సమీపంలో అరేబియా సముద్రంలో ప్రవేశించి మళ్ళీ బలహీనపడే సూచనలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications