AP Rains: ఏపీలో వాయుగుండం ఎఫెక్ట్-కోస్తాలో పలు చోట్ల కుండపోత..!
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో పలు చోట్ల కుండపోత కురుస్తోంది. మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో మోస్తరు వర్షం కురుస్తోంది. నైరుతి రుతుపవనాల్ని ఆహ్వానించేలా వాతావరణ పరిస్ధితులు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వర్షాలు ఊరటనిస్తున్నాయి.
కాకినాడ నగరంలో భారీ వర్షం కురిసింది. దాదాపు మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తీర ప్రాంత నగరం కావడంతో వాయుగుండం ప్రభావం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోంది. మిగతా తీర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. వాయుగుండం ఇవాళ తీవ్ర తుఫానుగా మారనుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మరిన్ని వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తోంది. రేమాల్ తుఫానుగా నామకరణం చేసిన దీని ప్రభావం ఏపీపై ఎక్కువగా ఉండే అవకాశాలు లేకపోవడం ఊరట.

వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో పలు చోట్ల సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో మత్సకారుల్ని వేటకు వెళ్లొద్దని స్థానిక అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవాళ, రేపు కోస్తాలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు చేస్తోంది. నిన్నటి నుంచి కర్నూలు, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు ప్రకటించారు.
మరోవైపు ఇవాళ తీవ్ర తుఫానుగా మారబోతున్న రేమాల్ రేపు అర్ధరాత్రి ఒడిశాలోని ఖేపుపరా, సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. దీని ప్రభావం తమిళనాడు, ఒడిశాలపైనే అధికంగా ఉండొచ్చని అధికారులు తెలిపారు. ఏపీపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చన్నారు. అయితే మోస్తరు వర్షాలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు.












Click it and Unblock the Notifications