ఏపీకి పొంచి ఉన్న తుపాను ముప్పు
వరదల నుంచి కోలుకుంటున్న ఏపీకి మరో బ్యాడ్ న్యూస్. రెండు వారాల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల కొన్ని జిల్లాల్లో సాధారణం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గత నెలలో బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. వీటి ప్రభావం ఏపీలోని ఉత్తరాంధ్రతోపాటు ఒడిసా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లోని తీర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఏపీలో విజయవాడ నగరం బుడమేరు పొంగడంతో సగం నగరం మునిగిపోయింది. ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. వరద వల్ల నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం నష్టపరిహారం కూడా అందజేసింది.
మోస్తరు వర్షాలు కురుస్తాయి
తాజాగా ఆదివారం పల్నాడు, గుంటూరు కృష్ణా, ఏలూరు, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయిన వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కోనసీమ, కాకినాడ ప్రాంతాలు ప్రభావితమవుతాయని, రాయలసీమలో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. రెండువారాల్లో ఏర్పడబోయే అల్పపీడన ప్రభావం తుపానుగా మారే అవకాశం ఉందని, దీనివల్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వరదవల్ల విజయవాడ నగరం ఎలా అయితే మునిగిపోయిందో అటువంటివి తిరిగి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

ఆదుకునేందుకు సిద్ధంగా..
దీంతో ఏపీ ప్రభుత్వం ఎప్పుడు వర్షాలు కురిసినా, వరదలు వచ్చినా వెంటనే నష్టపోయినవారిని ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసింది. మత్స్యకారులకు అవసరమైన అన్నిరకాల సహాయక చర్యలకు ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిసింది. అల్పపీడనం ఏర్పడటానికి రెండువారాల సమయం ఉండటంతో ఈలోగా అన్నిరకాల సహాయక చర్యలకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఎటువంటి విపత్తునైనా తట్టుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా ఆదివారం తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications