భారీ వర్షాల వేళ.. గుంటూరుకు బిగ్ అలర్ట్
Heavy rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదివరకట్లాగే- మరో విడత రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. నేడు, రేపు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చు. ఇప్పటికే భారీ వర్షాలు గుంటూరును ముంచెత్తాయి. నేడు కూడా అక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తాజాగా ఏర్పడిన అల్పపీడనం.. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంపై విస్తరించి ఉంది. పశ్చిమ- మధ్య ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా కదులుతోంది. ఉత్తరాంధ్రతో పాటు పొరుగునే ఉన్న ఒడిశా దక్షిణ ప్రాంత జిల్లాల తీరం దిశగా క్రమంగా ఇది విస్తరిస్తోంది. వచ్చే 24 గంటల్లో ఈ అల్పపీడనం.. ఛత్తీస్ గఢ్ తూర్పు ప్రాంత జిల్లాల గగనతలానికి చేరుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. దీనికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది.

దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో నేడు ఏపీ వ్యాప్తంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేశారు.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వివరించారు.
రాయలసీమ రీజియన్ లోని వైఎస్ఆర్ కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. సోమవారం సాయంత్రం 6 గంటల నాటికి తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 57 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. రాజమహేంద్రవరం- 42, కాకినాడ జిల్లా పిఠాపురం- 37.2, కందరాడ- 36.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications