రాజ్యసభ సీటుకు లాబీయింగ్ మొదలైందా?: రేసులో హీరో రానా తండ్రి
హైదరాబాద్: త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అవనున్న రాజ్యసభ సీట్ల కోసం అప్పుడే లాబీయింగ్ మొదలైంది. తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సీటును ఆశిస్తున్నవారిలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు దగ్గుబాటి సురేష్, డాక్టర్ కేఎల్ నారాయణ ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
రాజ్యసభ సీటుపై ఉన్న ఆసక్తిని వీరిద్దరూ ఇటీవలే టీడీపీ పెద్దలకు తెలియజేశారని, పరిశీలిస్తామని వారు హామీ ఇచ్చినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లకు ఎన్నికలు ఈ ఏడాది జూన్‌లో జరగనున్న సంగతి తెలిసిందే.
ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి మూడు సీట్లు దక్కనుండగా.. ప్రతిపక్షమైన వైసీపీకి ఒక సీటు దక్కనుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి దక్కే మూడు సీట్లలో ఒక సీటును తమకు కేటాయించాలని మిత్రపక్షమైన బీజేపీ కోరుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇక దగ్గుబాటి సురేష్ బాబు విషయానికి వస్తే టీడీపీ మాజీ ఎంపీ, సినీ నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడు కుమారుడు. దగ్గుబాటి కుటుంబం తొలి నుంచీ టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సురేష్‌ను రాజ్యసభకు పంపితే సినీ రంగం నుంచి పార్టీకి పూర్తి మద్దతు ఉంటుందనే అభిప్రాయాన్ని టీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
సినీ రంగంతో సన్నిహిత సంబంధాలున్న ఓ ఎమ్మెల్యేతో పాటు ఓ మంత్రి కూడా సురేష్ పేరును చంద్రబాబు వద్ద ఇప్పటికే ప్రస్తావించారనే ప్రచారం మీడియాలో జరుగుతోంది. మరోవైపు కెఎల్ నారాయణ కూడా టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.
తనను రాజ్యసభకు పంపితే పార్టీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని నారాయణ చెప్పినట్లు తెలిసింది. ఇక ప్రస్తుతం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు రాజ్యసభ సీటుకోసం అన్నివిధాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications