కెసిఆర్‌ను ఉతికేసిన దామోదర, రఘువీరా సూచన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుపై తెలంగాణ కాంగ్రెసు ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ తీవ్రంగా ధ్వజమెత్తారు. విశ్వాసానికి, విశ్వాసఘాతుకానికి మధ్య వచ్చే ఎన్నికలు జరుగుతున్నాయని, కెసిఆర్ విశ్వాసఘాతుకానికి మారుపేరు అని ఆయన వ్యాఖ్యానించారు. వంచన, మోసం కెసిఆర్ చిరునామా అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రచార కమిటీ సమావేశానంతరం ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ హామీలపై దళితులు, మైనారిటీలు ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని కలలు కుంటున్నారని ఆయన అన్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెసు ప్రభుత్వమే ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పాల్గొంటారని చెప్పారు. సికింద్రాబాద్, కరీంగనగర్, మహబూబ్ నగర్, మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ లేదా ఖమ్మంలో ఈ సభలు జరుగుతాయని ఆయన అన్నారు.
తెలంగాణలో దొరలకు, దళితులకు మధ్య ఎప్పుడూ పోరాటమేనని ఆయన అన్నారు. సీమాంధ్రలో నష్టపోయినా కాంగ్రెసు తెలంగాణ ఇచ్చిందని ఆయన చెప్పారు. తెరాసతో పొత్తు వద్దని, వ్యక్తిగతంగా తెరాసతో పొత్తుకు తాను వ్యతిరేకమని, అయితే పొత్తు విషయంలో అధిష్టానం నిర్ణయమే తమ నిర్ణయమని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెసుపార్టీయే అనే నినాదంతో బస్సు యాత్రలు ఉంటాయని ఆయన చెప్పారు.

డబ్బున్నవారికే కెసిఆర్ టికెట్లు ఇస్తున్నారని మాజీ తెరాస నేత ఇబ్రహీం అన్నారు. ఆయన శనివారంనాడు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో కాంగ్రెసులో చేరారు. కెసిఆర్‌కు ప్రజలే సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ పార్టీ అని కెసిఆర్ మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెసు న్యాయం చేసిందని ఆయన అన్నారు.
మాజీలకు టికెట్లు నో..
పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మాజీ శాసనసభ్యులకు, శాసనసభ్యులకు, నాయకులకు టికెట్లు ఇవ్వబోమని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి చెప్పారు. ఇందిరాభావన్‌లో శనివారం జిల్లా కాంగ్రెసు కమిటీ అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. సిట్టింగులందరికీ టికెట్లు ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.
సిట్టింగులు లేని చోట్ల మూడు పేర్లతో ఆశావహుల జాబితాను సమర్పించాలని ఆయన డిసిసి అధ్యక్షులకు సూచించారు. ఈ నెల 31వ తేదీన అభ్యర్థుల జాబితా సిద్ధం చేసి అధిష్టానానికి పంపుతామని ఆయన చెప్పారు. తాము చేపట్టిన బస్సు యాత్ర మంచి ఫలితం ఇచ్చిందని ఆయన చెప్పారు. డిసిసి అధ్యక్షులు కూడా బస్సు యాత్రలు చేయాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications