క్యాంపస్ నియామకాల్లో అదరగొట్టిన ఐఐటీ బాంబే విద్యార్ధులు... మరో తెలుగు విద్యార్ధికి రూ. 80.60 లక్ష
హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివిన విద్యార్ధులు ప్రతిష్టాత్మక సంస్ధల్లో భారీ వేతనాలతో ఉద్యోగాలను పొందుతూ తెలుగు విద్యార్ధులు తమ ప్రతిభను చాటుతున్నారు. మూడు రోజుల క్రితం ముంబయి ఐఐటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీమేఘన గూగుల్ సంస్థలో రూ. 75 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సంపాదించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడికి చెందిన సిద్దార్థ్ మైక్రోసాఫ్ట్ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యాడు. అతనికి మైక్రోసాఫ్ట్ రూ. 80.60 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. అమెరికాలోని రెడ్ మౌంట్‌లో ఉన్న మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. ప్రస్తుతం సిద్ధార్థ్ గౌహతి ఐఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.

ఇక ఐఐటీ బాంబేలో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలి రెండు రోజుల్లో 280 విద్యార్ధులు క్యాంపస్ నియామకాల్లో జాబ్ ఆఫర్లను సాధించారు. ఈ క్యాంపస్ నియామకాల్లో ఈ కామర్స్, బ్యాంకింగ్, తయారీరంగానికి చెందిన పలు కంపెనీలు పాల్గొన్నాయి.
తొలిరోజు సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఇంటర్యూలో అత్యధికంగా 220 మంది విద్యార్ధులు సెలెక్ట్ అయ్యారు. ఐఐటీ బాంబేలో అత్యధిక వార్షిక వేతనం(రూ. 1 కోటి)తో పాటు ఎక్కువ జాబ్ ఆఫర్లను ఇచ్చిన కంపెనీగా ఎన్ఈసీ జపాన్ నిలిచింది. దేశీయంగా వార్షిక వేతనం రూ. 12-14 వరకు విద్యార్ధులు పొందారు. ఈ రెండు రోజుల్లో సుమారు 70 కంపెనీలు వరకూ విద్యార్ధులకు ఇంటర్యూలు నిర్వహించినట్లు ఐఐటీ ప్లేస్‌మెంట్ ఇన్ ఛార్జి ప్రొపెసర్ అవిజిత్ ఛటర్జీ తెలిపారు.
ఇంటెల్, ఓరాకిల్ సంస్ధలు చెరో 10 మంది విద్యార్ధులకు జాబ్ ఆఫర్లను ప్రకటించాయన్నారు. సిస్కో 8, అమెజాన్, శాంసంగ్ ఇండియా చెరో 5 జాబ్ ఆఫర్లను విద్యార్ధులకు ఇచ్చాయని తెలిపారు. ఈ ఏడాది శాంసంగ్ కంపెనీ నియామకాలను పూర్తిగా తగ్గించిందన్నారు. గత ఏడాది ఒక్క శాంసంగ్ కంపెనీయే 271 క్యాంపన్ జాబ్ ఆఫర్లను ప్రకటించిందన్నారు.












Click it and Unblock the Notifications