శవాలై తేలిన పిల్లలు: గురుప్రసాదే చంపి పాతిపెట్టాడు
హైదరాబాద్: అత్యంత విషాదకరమైన స్థితిలో ప్రొఫెసర్ గురుప్రసాద్ ఇద్దరు పిల్లలు శవాలై తేలారు. గురుప్రసాద్ ఇద్దరు కుమారుల జాడ కోసం తీవ్రంగా గాలించిన రెండు పోలీసు బృందాలు రెండు వారి శవాలను మేడ్చల్ ప్రాంతంలో గుర్తించారు. భార్యపై కోపంతోనే గురుప్రసాద్ వారిని చంపి ఉంటాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కల్పతరు రెసిడెన్సీ వెనక భాగంలోని ఖాళీ స్థలంలో శవాలను పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. పూడ్చి పెట్టిన శవాలను పోలీసులు వెలికి తీశారు. ఇద్దరు పిల్లలు విఠల్ విరించి (9), నంద విహారీ (5)లను చంపి, శవాలను కాల్చి పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఎమ్మార్వోలను రప్పించి, సంఘటనా స్థలంలోనే పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు.
పిల్లల శవాలను గుర్తించిన విషయాన్ని డిసిపి ధ్రువీకరించారు. వారి జాడ కోసం రెండు పోలీసు బృందాలు గాలించాయి. గురుప్రసాద్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలించిన పోలీసులు వారి మృతదేహాలను కనిపెట్టారు. పిల్లలను చంపిన తర్వాతనే గురుప్రసాద్ భార్య వద్దకు వచ్చి కలిసి ఉందామని అడిగినట్లు చెబుతున్నారు. అతను తన వద్దకు వచ్చినప్పటి నుంచి పిల్లలు కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గురుప్రసాద్ భార్య ఫిర్యాదు చేసిన 48 గంటల తర్వాత అత్యంత దారుణమైన స్థితిలో పిల్లలు హత్యకు గురై కనిపించారు. పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన గురుప్రసాద్ భార్య స్పృహ తప్పి పడిపోయింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
పిల్లలను చంపిన తర్వాతనే గురుప్రసాద్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. గురుప్రసాద్ శవం రైలు పట్టాల సమీపంలో కనిపించింది. పిల్లల శవాలకు పోస్టుమార్టం నిర్వహిస్తే తప్ప పిల్లలు ఎలా మరణించారనేది తెలియదు. శనివారంనాడు పిల్లలను గురుప్రసాద్ కల్పతరు రెసిడెన్సీకి తీసుకుని వచ్చినట్లు భావిస్తున్నారు. ఇద్దరి శవాలను బహిరంగ ప్రదేశంలో పూడ్చిపెట్టారు.












Click it and Unblock the Notifications