నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోస్తాపై 'రోను': సుడులు తిరుగుతూ గంటకు 8 కి.మీ వేగంతో అతి భారీ వర్షాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: బంగళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 'రోను' తుఫానుగా మారి కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోను తుఫాన్ ప్రస్తుతం మచిలీపట్నానికి 125 కిలోమీటర్లు ఆగ్నేయంగా, విశాఖకు నైరుతి దిశగా 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణశాఖ వెల్లడించింది.

ఇది గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుందని పేర్కొంది. కాగా శుక్రవారం రాత్రికి ఆంధ్రా-ఒడిశా తీరంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. రోను తుఫాన్ ప్రభావంతో
తమిళనాడు, కోస్తాంధ్ర, ఒడిశా, పాండిచ్చేరి రాష్ట్రాల్లో గురువారం, శుక్రవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

నెల్లూరులో గాలులతో కూడిన వర్షం

రోను తుపాను ప్రభావంతో నెల్లూరు సిటీతోపాటు గూడూరు, కావలి, ఆత్మకూరు, నాయుడుపేట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. తుపాను దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాల్లో కంట్రోల్‌రూమ్‌లను అధికారులు ఏర్పాటుచేశారు.

విజయనగరంలో భారీ వర్షాలు

విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం పట్టణాల్లో రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

కోస్తాంధ్రలో భారీ వర్షాలు

రోను తుపాను ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ నేపథ్యంలో ఏపీలో ఏయే జిల్లాల్లో ప్రభావితం కానున్నాయో ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇప్పటికే అధికారులు సహాయక చర్యలను ప్రారంభించారు.

Deep depression in Bay gains strength

అన్ని చర్యలు తీసుకున్నాం

రోను తుఫాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని విశాఖ జిల్లా కలెక్టర్‌ యువరాజ్‌ తెలిపారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. కోస్తా తీరం వెంబడి అన్ని ఓడరేవుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని చెప్పారు.

బంగాళాఖాతం తీరం వెంబడి 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను
సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు.

తుపాను తీవ్రత పెరిగే అవకాశం ఉంటే వారిని దగ్గర్లోని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు విశాఖ జిల్లాలోని రెవెన్యూ అధికారులు అందరినీ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు.

సీఎం చంద్రబాబు సమీక్ష

ఏపీలో నెలకొన్న తుఫాను పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి గురువారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీఎస్ టక్కర్‌తో పాటు తీర ప్రాంతాల జిల్లా కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తుఫాను నష్ట నివారణకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.

అధికారులు తీసుకుంటున్న చర్యలు ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురు గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన ఆదేశించారు.

రోను తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా ప్రభావం చూపుతోంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడింది. గురువారం రాత్రికి పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

English summary
Following heavy rains in Andhra Pradesh on Thursday night, the met department has predicted that light rain will continue till Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X