ఏపీలో ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు-భారతి,సాయిరెడ్డిపై టీడీపీ-భువనేశ్వరిపై వైసీపీ విమర్శలతో
తాజాగా ఢిల్లీలో బయటపడిన మద్యం కుంభకోణం వ్యవహారంలో ఏపీలో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి, వైసీపీలో నంబర్ టూ గా భావించే ఎంపీ విజయసాయిరెడ్డి పేర్లు వినిపించాయి. దీంతో టీడీపీ వీరిద్దరి పాత్ర తేల్చాలంటూ టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. దీనికి కౌంటర్ గా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి పేర్లతో వైసీపీ విమర్శలు ప్రారంభించింది. దీంతో తిరిగి టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది.

ఏపీలో ఢిల్లీ మద్యం స్కాం పాలిటిక్స్
ఢిల్లీలో తాజాగా బయటపడిన మద్యంస్కాం వ్యవహారంతో ఏపీకి లింకులున్నాయనే ప్రచారం ఈ మధ్య జోరుగా సాగింది. ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితతో పాటు ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు సీఎం జగన్ సతీమణి భారతి పేర్లు కూడా వినిపించాయి. అయితే అధికారికంగా మాత్రం ఎక్కడా వివరాలు బయటికి రాలేదు. దీంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ విపక్ష టీడీపీ మాత్రం దీనిపై రాజకీయాలు మొదలుపెట్టేసింది. వైఎస్ భారతి, విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు మొదలిపెట్టింది.దీంతో వైసీపీ కూడా ఘాటుగా బదులిస్తోంది.

భారతి, సాయిరెడ్డిపై టీడీపీ విమర్శలు
ఢిల్లీ మద్యం కుంభకోణంతో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి లింకులు ఉన్నాయంటూ వచ్చిన వార్తల్ని ఆధారంగా చేసుకుని టీడీపీ నేతలు వీరిద్దరిపై విమర్శల దాడి మొదలుపెట్టారు. ఏపీలో వైసీపీ నేతలకు ఢిల్లీ మద్యం స్కాంతో ఉన్న లింకుల నేపథ్యంలో త్వరలో సీబీఐ వీరిపై దర్యాప్తు చేస్తుందని, ప్రభుత్వం కూడా వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వం ఇప్పటికే నాసిరకం మద్యం తయారు చేసి వ్యాపారం చేస్తోందని, మద్యం కుంభకోణంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని టీడీపీ విమర్శిస్తోంది. దీంతో వైసీపీ నేతలు కూడా ఎదురుదాడికి దిగారు.

భువనేశ్వరి, బ్రహ్మణిపై వైసీపీ విమర్శలు
తమ నేతలు విజయసాయిరెడ్డి, భారతిపై మద్యం కుంభకోణం ఆరోపణలు చేస్తున్న టీడీపీకి కౌంటర్ గా వైసీపీ నేతలు కూాడ రంగంలోకి దిగారు. ఏకంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఆమె కోడలు బ్రహ్మణి పేర్లను ఇందులోకి లాగారు. వీరిపై ఎక్కడా ప్రచారం జరగకపోయినా వీరిద్దరి పాత్ర ఉందంటూ వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. దీంతో ఇవాళ టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, పంచుమర్తి అనురాధ ఎదురుదాడికి దిగారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైఎస్ భారతి, విజయసాయి రెడ్డి పాత్రను బయటపెట్టామనే అక్కసుతోనేచంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు భువనేశ్వరి , బ్రాహ్మణి గురించి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications