వరంగా అమరావతి: పెళ్లి కాని ప్రసాదులకు భలే డిమాండ్!

Subscribe to Oneindia Telugu

అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఇప్పుడిప్పుడే కొత్త కొత్త భవనాలతో రూపుదిద్దుకుంటోంది. రాజధాని ఏర్పాటుకు ముందే ఇక్కడి ప్రాంతం వారికి కాసుల వర్షం కురిపించిన అమరావతి.. ఇప్పుడు పెళ్లి కాని ప్రసాదుల పట్ల వరంగా మారుతోంది.

ఇంతుకుముందు అమెరికా, ఆస్ట్రేలియా, ఎన్నారై సంబంధాల వైపు మొగ్గుచూపిన వారు కూడా అమరావతిలో బాగా స్థిరపడ్డ యువకుడికి ఇచ్చి తమ కూతుళ్లను కట్టబెట్టేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. అమరావతి రాజధాని రావడంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే.

అంతేగాక, అమరావతిలో తమ కూతురు ఉంటే రాజధాని ఉన్నట్లేనని అమ్మాయిలు తండ్రులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమరావతిలో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ప్రైవేట్ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడి వెలిసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా మారే అవకాశం కూడా లేకపోలేదు.

ఈ క్రమంలో ఒకప్పుడు అమెరికా సంబంధం, ఆస్ట్రేలియా సంబంధం కోసం పాకులాడిన అమ్మాయిల తల్లిదండ్రులు నేడు మాత్రం తమ ఆలోచనను మార్చుకుంటున్నారు. దీంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉంటున్న పెళ్లి కాని యువకుల పంట పండినట్లేనని కనిపిస్తోంది.

amaravathi

దేశం కాని దేశం పంపించి ఎప్పుడో సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో చూసుకుంటూ బాధపడే కంటే, గుంటూరు, విజయవాడ ప్రాంతంలో ఇచ్చుకుంటే నెలకోసారైనా కూతురి కష్టసుఖాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ విషయంలో కొంచెం ముందు ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేగాక, తమ అల్లుడికి అమరావతి ప్రాంతంలో ఎకరం పొలం ఉన్నా చాలు ఏ పనీచేయాల్సిన అవసరం లేకుండా తమ కూతురు దర్జాగా బతికేయవచ్చనే ధీమా కూడా తల్లిదండ్రులకు బానే పెరిగిపోయింది.

ఇదిలా ఉంటే అమరావతి, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉంటున్న యువకులు కొంతమంది బైక్‌ల మీద తిరగడం మానేసి కార్లలో తిరుగుతుండటం గమనార్హం. ఇంకొంతమందైతే భిన్నంగా ఉంటుందేమోనని ఏకంగా గుర్రాలపై షికార్లు చేస్తున్నారట. వినడానికి అతి అనిపించినా ఇది నిజం. ఇదంతా కొత్త రాజధాని అమరావతి తెచ్చిన ఘనతే మరి.

కాగా, రాజధాని ప్రాంతంలో ఉన్న కుర్రాడికి జాబ్ ఉందా? లేదా? అనే విషయం కన్నా పొలం ఉందా? లేదా? అనే ధోరణిలోనే అమ్మాయిల తల్లిదండ్రులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి అల్లుళ్లకు లక్షలు పెట్టేందుకు కూడా అమ్మాయిల తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారట. ఎందుకంటే.. గుంటూరు, విజయవాడ, తుళ్లూరు ప్రాంతాల్లోని భూములు కోట్లలో ధరలు పలుకుతున్నాయి. అందువల్ల నూతన రాజధాని అమరావతి ప్రాంతంలోని పెళ్లి కాని ప్రసాదులకు ఇప్పుడు ఎక్కడా లేనీ డిమాండ్ పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that demand is increased for Amaravati's bachelors.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి