• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వణికిస్తున్న డెంగ్యూ: ప్రకాశం, విశాఖ జిల్లాల్లో తల్లడిల్లుతున్న జనం

By Swetha Basvababu
|

హైదరాబాద్ / అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లోని పలు గ్రామాలు డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా జ్వరాలతో వణికిపోతున్నాయి. ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతంలోని బాధితులను కొందరు అత్యవసర సేవల నిమిత్తం గుంటూరు, నరసరావుపేట, కర్నూలు ప్రాంతాలకు వెళ్తున్నారు.

కొన్ని చోట్ల నెల రోజులుగా వైద్యశిబిరాలు కొనసాగిస్తున్నా పరిస్థితి అదుపులోకి రాలేదంటే సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పారిశుద్ధ్యం మెరుగుదలకు రూ. కోట్లలో ఖర్చు చేస్తున్నా ఆచరణలో క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మాత్రం మార్పు కాన రావడం లేదు. గత నెల నుంచి ప్రకాశం జిల్లాలో జ్వరాల సమస్య మొదలైంది. ఒంగోలులోని రిమ్స్ లో అధికారికంగా 190 డెంగ్యూ కేసులు అధికారికంగా నమోదయ్యాయి. అనధికారికంగా వందల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు అంచనా.

వివిధ రకాల జ్వరాలతో ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులతో పాటు గుంటూరు, నరసరావుపేట, కర్నూలులోని పలు వైద్యశాలల్లో రమారమీ 25 వేల మంది చికిత్స పొందుతున్న వారు ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో అవగతమవుతున్నది. ఈ జిల్లాలో పారిశుద్ధ్యం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.85.81 కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యమని చెప్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతంలో గ్రానైట్‌ పరిశ్రమ రాకముందు మలేరియా జ్వరాలే నమోదు కాలేదని మూడు, నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహిస్తున్న వైద్యులు చెబుతున్నారు.

Dengue affected in AP districts Prakasam & Vishaka
విరామం లేకుండా మలేరియా జ్వరాలు

పనులు నిలిపేసిన 20 క్వారీల గుంతల్లో ఏళ్ల తరబడి నీరు నిల్వ చేరి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. ఇటీవలి వర్షాలతో ఆయా క్వారీ గుంతలు మళ్లీ తమ ప్రతాపం చూపుతున్నాయి. ఈ కారణంగానే చీమకుర్తితో పాటు మండలంలోని ఆర్‌ఎల్‌పురం, బూదవాడ, యల్లయ్యనగర్‌, మర్రిచెట్లపాలెం, రామతీర్థం తదితర ప్రాంతాల్లో విరామం లేకుండా మలేరియా కేసులు నమోదవుతున్నాయి. గేదెలు, ఆవుల్లో పాల ఉత్పత్తి పెంచేందుకు వాడుతున్న మొలాసిస్‪తో ఈ పశువులు వేసే పేడ నుంచి కాస్త దుర్వాసన ఉంటుంది.

వీటినే ఇళ్ల మధ్య, రోడ్ల పక్కన ఎరువుదిబ్బలుగా వేస్తున్నారు. చినుకుపడితే పరిస్థితి మరింత అధ్వానంగా తయారవుతోంది. ఇక్కడే దోమలు ఓ స్థాయిని మించి ప్రబలుతున్నాయి. వీటివల్లే తాళ్లూరు మండలం అయ్యలపాలెం, నాగంబొట్లవారిపాలెం, లక్కవరం, దోసకాయలపాడు, బొద్దికూరపాడు, మాధవరం తదితర ప్రాంతాల్లో ఎక్కువగా జ్వరాలు నమోదవుతున్నాయని... కొందరు ప్రైవేటు వైద్యనిపుణులు చెబుతున్నారు. చీమకుర్తి మండలం పాటిమీదపాలెం, పి.నాయుడుపాలెం, దేవరపాలెం, బండ్లమూడి, మంచికలపాడు తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

Dengue affected in AP districts Prakasam & Vishaka

డెంగ్యూ మాటున గొల్లలపాలెం

విశాఖపట్నం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లలపాలెం గ్రామంలో రోజుకు కనీసం ఆరు నుంచి పదిమంది వరకు డెంగ్యూ ప్రాథమిక లక్షణాలతో బాధపడుతూ జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుతున్నారు. బుధ, గురువారాల్లో ఇద్దరు చొప్పున రోగులు ఈ గ్రామానికి చెందిన ఇద్దరు బుధవారం, మరో ఇద్దరు గురువారం విశాఖపట్టణానికి జిల్లా కేంద్రాసుపత్రికి రిఫర్‌ చేశారు. దీంతో గ్రామంలో డెంగ్యూ జ్వరం ఏం చేస్తుందోనన్న ఆందోళన నెలకొంది. 15 రోజులుగా డెంగ్యూ జ్వరాలతో గ్రామం అతలాకుతలమవుతున్నది.

15 రోజుల్లో నిర్వహించిన వైద్యశిబిరానికి 515 మంది రోగులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 101 మందికి వైరల్‌ జ్వరాలు వచ్చాయని గుర్తించారు. డెంగ్యూ ప్రాథమిక లక్షణాలతో జిల్లా కేంద్రాసుపత్రికి వచ్చిన వారు 28 మంది ఉన్నారు. విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో ముగ్గురు, ప్రైవేట్ ఆసుపత్రిలో మరొకరు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం 18 మంది వరకు జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

రెండు రోజుల క్రితం నిర్వహించిన 30 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే ఆరుగురికి డెంగ్యూ సోకినట్లు తేలింది. ఈ గ్రామంలో గత నెల 23వ తేదీ నుంచి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. మీడియాలో వార్తలొచ్చాక ఈ గ్రామాన్ని సందర్శించిన జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ,కలెక్టర్ ఆదేశాలతో డీఎంహెచ్‌ఓ పద్మజ సందర్శించారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

English summary
Dengue fever effected in Prakasam and Vishakapatnam districts. Cheemakurthy and Gollala palem village in Cheepurupally mandal VishakaPatnam severly effected with Dengue fever. Since last month officials taken precautionary actions but there is no change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X